AP: నిరసనలతో కదం తొక్కిన ఉద్యోగ, ఉపాధ్యాయులు

AP: నిరసనలతో కదం తొక్కిన ఉద్యోగ, ఉపాధ్యాయులు
ఆందోళనలు ర్యాలీలతో హోరెత్తిన ఆంధ్రప్రదేశ్‌... జగన్‌ సర్కార్‌ వైఖరిపై తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో సమస్యల పరిష్కరం కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు కదం తొక్కారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలతో హోరెత్తించారు. పాదయాత్రలో సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్‌.... అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చకపోతే.... ఈనెల 27న మరో BRTS రోడ్డు ఉద్యమాన్ని చూస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు ఆదివారం చేపట్టనున్న చలో విజయవాడకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై... ఉద్యోగులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద ఏపీ ఐకాస ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నాలుగేళ్లుగా సమస్యలపై పోరాడుతున్నా..... ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఉద్యోగులు మండిపడ్డారు..


కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్‌ వద్ద ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గుంటూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. నిరసనలో పాల్గొన్న ఏపీ జేఏసీ ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు.... బకాయిలు చెల్లించేవరకు ఆందోళనలు ఆపబోమని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్డీవో కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాల నేతలు ధర్నా నిర్వహించి.... అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంయుక్త కార్యచరణ ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు కట్టుకునినిరసన తెలిపారు. కడపలో మహవీర్‌ సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం తహసీల్దార్‌ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి.... అక్కడ ఆందోళన తెలిపారు.


ఏలూరులో ఏపీ ఎన్జీవో సంఘం ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ ర్యాలీగా వెళ్లి..... కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం తహసీల్జార్‌ కార్యలయం ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నేతలు ఒ‍కరోజు నిరశన కార్యక్రమం నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.

మరోవైపు C.P.S. ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడకు అనుమతులు లేవని.... డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఉద్యోగులకు అనుమతులు ఇవ్వలేమన్నారు. విజయవాడలో సెక్షన్ 30, 144 అమలులో ఉన్నాయని..నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టులు తప్పవని హెచ్చరించారు. చలో విజయవాడకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై A.P.C.P.S.E.Aరాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియాదాస్.... ఆసహనం వ్యక్తం చేశారు. తాము ఏమన్నా సంఘ విద్రోహ శక్తులమా? టెర్రరిస్టులమా? అని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story