AP: వాలంటీర్లకు జగన్ సర్కార్ మరో నజరానా

గ్రామ వాలంటీర్లకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే వారికి ఏటా సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులతో నగదు పురస్కారాలు అందిస్తుండగా.. మరో నజరానా ప్రకటించింది. వాలంటీర్ల అభినందన కార్యక్రమం - 2024' పేరుతో ఉత్తమ సేవలు అందించిన వారిని మండల, పట్టణ, జోనల్, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో సన్మానించి నగదు బహుమతులు అందించనున్నారు. వీరి ఎంపిక కోసం జిల్లా స్థాయి కమిటీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్ గా ఉంటారు.
ఎంపిక ఇలా
వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఆసరా, చేయూత పథకాల అమలులో చక్కని పని తీరు కనబరిచిన వాలంటీర్లను గుర్తించి ఈ ఏడాది సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలం, పట్టణం, జోనల్, నియోజకవర్గం, జిల్లాకు ఒకరిని చొప్పున కమిటీ ఎంపిక చేయనుంది. ఫిబ్రవరి మూడో వారంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఎంపికైన వాలంటీర్లను సత్కరించనున్నారు. మండల, పట్టణ, జోనల్ స్థాయిలో ఎంపికైన వారికి రూ.15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ.25 వేల చొప్పున నగదు బహుమతులు అందించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com