AP: వరుసగా మూడోసారి జనం ఓట్లేస్తారా ?

AP: వరుసగా మూడోసారి జనం ఓట్లేస్తారా ?
ఈ 60 మంది ఎమ్మెల్యేలు ఈ సారి కష్టమే..

అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకత ఉండడం అనేది సర్వసాధారణం.. ఎంత చేశామని చెప్పుకున్నా తమ జీవితాలు బాగుపడనప్పుడు ప్రజలు తీవ్ర అసంత్రుప్తి వ్యక్తపరుస్తారు.అది అయిదేళ్ళకోసారి వచ్చే ఎన్నికల్లో ప్రతిబింబిస్తుంది. అటువంటిది అదే ఎమ్మెల్యేలను రెండు సార్లు వరుసగా ఎన్నుకున్నా ఏమీ చేయకపోతే ? మళ్ళీ వాళ్లే మూడోసారి ఓట్లడగడానికి వస్తే ? పైగా వారి పార్టీయే అయిదేళ్లు అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోతే ? ఇంకెలా ఉంటుంది ? ఇప్పుడిదే ఆంధ్రప్రదేశ్ లో 60 మంది వైసీపీ ఎమ్మెల్యేలను వణికిస్తున్న అంశం.



2011లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పేరిట పార్టీని మొదలుపెట్టిన వై.ఎస్. జగన్మోహనరెడ్డి 2014లో దాదాపు అధికారంలోకి వచ్చాననే భావించారు. పాదయాత్రకు, ఆ తర్వాత ఎన్నికల సభలకు వచ్చిన స్పందన వారిని ఊహల పల్లకీ ఎక్కించింది. అయితే విభజన తర్వాత ఏపీ కోలుకోవాలంటే సమర్ధుడైన నేత చేతిలో రాష్ట్రాన్ని పెట్టాలని ప్రజలు భావించారు దాంతో చంద్రబాబుకు ఆ ఆవకాశం దక్కింది. అప్పట్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా కొన్ని ఏరియాల్లో వైసీపీ విశేష ప్రభావాన్నే చూపింది. శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు టీడీపీ హవా ఉన్నా ప్రకాశం నుంచి పరిస్థితి మారిపోయింది.



అనంతపురం జిల్లా మినహా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లలో వైసీపీ మెజార్టీ సీట్లను దక్కించుకుంది. ఈ ప్రాంతాల్లో కుల పరమైన, వర్గపరమైన సమీకరణలు, అంగబలం వైసీపీకి కలిసొచ్చాయి. దీని వల్లే ఆ ఎన్నికల్లో 67 సీట్లు సాధించగలిగింది. కట్ చేస్తే 2019 ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అనే తేడా లేదు. 2014 నుంచి 2019 వరకు వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో కొందరు మధ్యలో టీడీపీ లో చేరిపోయారు. మిగిలిన వారిలో అతి కొద్ది మంది తప్ప దాదాపు అంతా మళ్ళీ 2019లో గెలిచేశారు. అంటే వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.



2014లో గెలిచినప్పడు వారు తాము ప్రతిపక్ష ఎమ్మెల్యేలమని టీడీపీ అధికారంలో ఉండడంతో ఏమీ చేయలేపోతున్నామని చెప్పుకున్నారు. అలా ఆ టర్మ్ గడచిపోయింది. మళ్లీ రెండోసారి గెలిచాకనే చావొచ్చిపడింది. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం. మీరే అధికారంలో ఉన్నారు. ఏం చేశారో చెప్పండంటూ జనం నిలదీస్తున్నారు. 2024 లో జరిగే ఎన్నికల్లో వైసీపీకి ప్రాణ సంకటంగా మారబోతున్న పరిస్థితి ఇది. ఇటువంటి జాబితాలో ఉన్న నియోజకవర్గాల సంఖ్య ఎంతో తెలుసా .. అక్షరాల 60. గడప గడపకీ ప్రభుత్వం కార్యక్రమంలో ఎక్కువ నిలదీతలు, గొడవలు జరుగుతోంది కూడా ఈనియోజకవర్గాల్లోనే. ఈ ఎమ్మెల్యేలను చూడగానే ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మిమ్మల్ని వరుసగా గెలిపిస్తూనే వచ్చాం. మాటలు తప్ప చేతలు లేవంటూ ముఖం మీదే అడిగేస్తున్నారు.



ఈ 60 నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల 2014 లో ఎమ్మెల్యే వేరు, 2019లో ఎమ్మెల్యే వేరు. కానీ వరుసగా రెండు ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసింది మాత్రం ఫ్యాన్ గుర్తుకే. దాంతో వీరంతా వరుసగా మూడోసారి మా పార్టీకి ఓటేయమంటూ ప్రజల వద్దకెళ్ళి ఓట్లగడగబోతున్నారు. రాజకీయాల్లో ఇది ఏ పార్టీకైనా టఫ్ టాస్క్.. ఒక ఎమ్మెల్యే హ్యాట్రిక్ సాధించాలంటే తేలికైన పనికాదు. నియోజకవర్గాన్ని బాగా అభివ్రుధ్ది చేసి ఉండాలి, లేదా నియోజకవర్గంలో ప్రత్యర్దులను, ప్రత్యర్ధి పార్టీలను ఎదగనీయకుండా అణచివేసైనా ఉండాలి. ఇప్పడు ఈ 60 నియోజకవర్గాల్లో వైసీపీకి మొదటి కేటగరీ ఏ మాత్రం వర్తించదు.



విపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజల్ని పట్టించుకున్న వారు కాగడా పెట్టి వెతికినా కనిపించరు. కాబట్టి ఎన్ని సార్లయినా సరే మా ఎమ్మెల్యే సారేకావాలని జనం కోరుకునే సీను ఎంతమాత్రం లేదు. ఇక రెండో కేటగరీ ... అంటే బలప్రయోగంతో నియోజకవర్గంలో పట్టు నిల్పుకోవడం. పులివెందుల, పుంగనూరు లాంటి రెండు మూడు నియోజకవర్గాలు మాత్రం ఈ జాబితాలో కనిపిస్తాయి. ఈసారి ఇలాంటి చోట కూడా ఫ్యాన్ కి చెమటలు పట్టిస్తామని టీడీపీ అంటోంది. మొత్తంగా ఈ 60 మంది ఎమ్మెల్యేలు వరుసగా మూడోసారి గెలవడం అత్యంత కష్టసాధ్యంగా కనిపిస్తోంది. వైసీపీ పాలన లో కరెంటు చార్జీలు పెరిగాయి, పెట్రోధరలు పెరిగాయి, ఆస్థిపన్ను పెంచారు, చెత్త పన్ను వేశారు, నిత్యావసరాల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. నాణ్యతలేని మద్యాన్ని అత్యధిక ధరలు పెట్టి చివరికి తాగుబోతుల్ని కూడా దోచుకుంటుందీ సర్కారు... కనీసం రోడ్లపై తట్ట మట్టి వేసే దిక్కులేదు. ప్రాజెక్టుల గేట్లకు ఒక డబ్బా గ్రీజు రాసే పరిస్థితీ లేదు..



ఉద్యోగులు, ఫించను దార్లకు పీఆర్సీ కాదుకదా కనీసం సకాలంలో జీతాలిచ్చే దిక్కులేదు. నిరుద్యోగులకు జాబ్ క్యాలండర్ అంతకన్నా లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ పాలనలో అన్ని వర్గాల పరిస్థితీ ఇదే. పాత పథకాలకే కొత్త పేర్లు పెట్టి బటన్ నొక్కుతుతున్నాని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నా ప్రజలకు వై.ఎస్. జగన్ ప్రభుతం సినిమా అర్దమైపోయింది. తమ జేబునుంచి వంద తీసుకుని పది రూపాయలు చేతిలో పెడుతున్న తీరు బోధపడింది. గతంలో చంద్రబాబు ఇంకా అంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పడు వాళ్లు నేరుగా బటన్ లు నొక్కలేదు. అంతమాత్రాన అప్పట్లో ఫించన్లు రాలేదా ? ఫీజు రీఎంబర్స్ మెంట్ రాలేదా ? అయినా ముఖ్యమంత్రులున్నది బటన్ లు నొక్కడానికా ? రాష్ట్ర సర్వతోముఖాభివ్రద్దికి ప్రణాళిలు రచించి అమలు చేయడానికా ? దీన్ని జనం అర్ధం చేసుకోరా ? కాకపోతే ఒక్కోసారి ప్రజలు ఏదో ఒక ఎమోషన్ వల్లనో లేదా అబద్దపు ప్రచారాలను నమ్మో మోసపోవచ్చు. అన్ని సార్లు కాదు.



ఇప్పడు అదే వాస్తవ చిత్రం వైసీపీ ఎమ్మెల్యేల కళ్ళ ముందు కదలాడుతోంది.. విపక్షాల మీద ఈ స్థాయిలో దౌర్జన్యాలు చేస్తున్నా గడప గడపలో వైసీపీ ఎమ్మెల్యేలను జనం ఏమాత్రం వెరవకుండా నిలదీస్తున్నారు. ముఖ్యంగా మహిళలు మొహం మీదే కడిగేస్తున్న తీరు జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ స్థాయి కోపం ఉందనేదానికి అద్దం పడుతోంది. ఇదే ఇప్పడు ఈ 60 మంది ఎమ్మెల్యలేకు దడ పుట్టిస్తోంది. వరుసగా మూడోసారి మనకు జనం ఓటేస్తారా ? పులివెందుల లాంటి అయిదారు చోట్ల బయటపడ్డా కనీసం 50 సీట్లు ఎగిరిపోతాయనే భయం వైసీపీ పెద్దలను వెంటాడుతోంది.



విశేషమేమిటంటే ఈ జాబితాలోని 60 సీట్లలో 40 సీట్లు వైసీపీ అత్యంత బలంగా ఉన్న ప్రాంతాల్లోనివే. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాల పరిధిలోనే ఇలా 40 మంది వరుసగా మూడోసారి గెలిపించమని అడిగేందుకు జనం వద్దకు వెళ్తున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత, పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మీద ఉన్న వ్యతిరేకత కలిస్తే ఈ మొత్తం సీట్లు ఎగిరిపోతాయి. దీన్ని ద్రుష్టిలో ఉంచుకునే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఈ నియోజకవర్గాల్లో డబుల్ యాంటీ ఇన్ కంబెన్సీని వాడుకునే వ్యూహాలు రచిస్తోంది.



ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లా రాజాంలో కంభాల జోగులు, పాలకొండలో విశ్వాసరాయ కళావతి, విజయనగరం జిల్లా కురుపాంలో పుష్పశ్రీవాణి, సాలూరులో డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, విశాఖ పట్నం జిల్లా మాడుగులలో మరో డిప్యూటీ సీఎం ముత్యాల నాయడు ఈ జాబితాలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో మంత్రి దాడిశెట్టి రాజాకు, కొత్తపేటలో చిర్ల జగ్గిరెడ్డికీ ఇదే పరిస్థితి. ఇదే జిల్లాలో పత్తిపాడు, జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గంలోను వైసీపీ వరుసగా మూడోసారి గెలిపించమని అడుగుతోంది. ఇక క్రుష్ణా జిల్లాలో మాజీ మంత్రి కొడాలినాని, నూజివీడులో మేకా ప్రతాప అప్పారావు, తిరువూరులో రక్షణ నిధి కూడా ఇదే జాబితాలోకెక్కారు. ఉమ్మడి గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆళ్ల రామక్రుష్ణారెడ్డి, బాపట్లలో కోన రఘుపతి, నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాచర్లలో పిన్నెల్లి రామక్రుష్ణారెడ్డిలది కూడా ఇదే జాబితా .



అభ్యర్ధులు అటు, ఇటు మారినా కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురంలలోను సేమ్ సిట్యుయేషన్. ఇక నెల్లూరు జిల్లా నుంచి ఈ లిస్టు మరింత పెరిగిపోతుంది. ఈ ఉమ్మడి సింహపురి జిల్లాల్లో సర్వే పల్లిలో మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి మొదలుకుని కావలిలో ప్రతాప్ రెడ్డి, నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడురులో సునీల్ కుమార్, సూళ్లూరు పేటలో సంజీవయ్య వరకు అంతా వరుసగా రెండు సార్లు గెలిచిన వారే. వీళ్లందరినీ మూడోసారి ఆశీర్వదించడానికి నెల్లూరు జనం సిద్దంగా ఉన్నారా ? ఇక ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట తప్ప అన్నీ ఈ జాజితాలోనివే. కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కమలాపురంలో ముఖ్యమంత్రి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, పొద్దుటూరులో శివప్రసాదరెడ్డి, మైదుకూరులో రఘురామిరెడ్డి లు ఈ లిస్టులో కొస్తారు. రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి, రైల్వే కోడూరులో శ్రీనివాసులు 2009 నుంచే వరుసగా గెలుస్తూ వస్తున్నారు.

ఇన్ని సార్లు వరుసగా ఫ్యాన్ గుర్తునే గెలిపిస్తే మాకు ఒరగబెట్టిందేంటని కడప జిల్లా జనం మండిపోతున్నారు. ఈ జిల్లాలో ఉన్న రాజకీయ వాతావరణ వల్ల జనం బహిరంగంగా అంతగా బయటపడలేకున్నా ఎన్నికల కోసం వేచి చేస్తున్న పరిస్థితి. అనంతపురం జిల్లాలో మాత్రం కదిరి ఒక్కటే ఈ జాబితాలో ఉంది. ఎందుకంటే 2014లో రాయలసీమలో టీడీపీ హవా సాగింది ఈ జిల్లాలోనే.వరుసగా రెండు సార్లు గెలిచి మూడోసారి జనం వద్దకు వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు అధికంగా ఉన్న జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా .. ఇక్కడ ఏకంగా 11 నియోజకవర్గాల్లో ప్రజలు 2014లోను, 2019లోను వైసీపీనే గెలిపించారు. ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, కోడుమూరు, పాణ్యం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మారినా అవన్నీ వైసీపీ సిట్టింగ్ స్థానాలే. ఇక ఆలూరులో మంత్రి జయరాం, డోన్ లో మరో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదోనిలో సాయిప్రసాద్ రెడ్డి, మంత్రాలయంలో బాలనాగిరెడ్డిలు మూడోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు గడప గడప కార్యక్రమంలో ఎక్కువగా జనం తిరగబడ్డ దృశ్యాలు కూడా ఈ జిల్లాలోనే ఎక్కువగా కనిపించాయి.


చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పుతున్న నేతలంతా ఈ లిస్టులోనే ఉన్నారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుసగా నాలుగోసారి, పీలేరులో చింతల రామచంద్రారెడ్డి చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నగరిలో మంత్రి రోజాలు, గంగాధర నెల్లూరులో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిలు వరుసగా మూడోసారి గెలవాలని చూస్తున్నారు. ఇదే జిల్లాలో పూతలపట్టు, మదనపల్లి, పలమనేరు కూడా ఇదే జాబితాలో ఉన్నాయి. వరుసగా మూడోసారి గెలవడం అంటే హ్యాట్రిక్ కొట్టడమే. ఇది రాజకీయాల్లో కొద్దిమందికే సాధ్యమవుతుందనేది చరిత్ర చెప్పిన సత్యం. దీన్ని ద్రుష్టిలో ఉంచుకుని బహుశా వైసీపీ అధినేత జగన్ ఈ జాబితా లో ఉన్న 60 మందిలో ఈ సారి కొంతమందిని తప్పించే ఆలోచన కూడా చేయవచ్చు. అయితే వర్గ రాజకీయాలకు,ఫ్యాక్షన్ కు నెలవైన రాయలసీమలో సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించడం జగన్ లాంటి నేతకు కూడా అంత తేలికకాదు. అది పార్టీకి మరింత డ్యామేజ్ చేస్తుందనే భయం కూడా ఉంది. విధ్వంసం తప్ప వికాసం లేని పాలన తర్వాత మామూలుగానే వైసీపీకి ఓట్లేసే పరిస్థితి లేదనేది స్పష్టమవుతోంది. అలాంటిది ఇటు ప్రభుత్వ పరంగా, అటు వ్యక్తిగతంగాను యాంటీ ఇంకబెన్సీని ఎదుర్కుంటున్న ఈ 60 మంది 2024లో పోటీచేస్తే గెలిచి అసెంబ్లీకి వస్తారా ? చాలా కష్టం....

రావిపాటి

Tags

Read MoreRead Less
Next Story