APPCC: క్రైస్తవుడైన జగన్‌ స్పందించలేదేం?

APPCC: క్రైస్తవుడైన జగన్‌ స్పందించలేదేం?
మూడు రాజధానులు ఎక్కడ...? అభివృద్ధి ఏది..? సీఎం జగన్‌పై ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర ఆగ్రహం

ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానుల కడతానని చెప్పి..ఒక్కదాన్ని కూడా పూర్తి చేయలేక పోయారని ఆయన సోదరి, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు Y.S. షర్మిల మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 మంది ఎంపీలు బీజేపీ తొత్తుల్లా మారారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన షర్మిల...వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జగన్‌ సోదరి షర్మిల విజయవాడ కానూరులోని ఓ కల్యాణ మండపంలో... ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం గిడుగు రుద్రరాజును కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. షర్మిల సమక్షంలో మంగళగిరి MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. తన తండ్రి రాజశేఖరరెడ్డి రెండుసార్లు చేపట్టిన పీసీసీ చీఫ్‌ పదవిని తాను చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని షర్మిల తెలిపారు. ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు


ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడిగా రాజీనామా చేస్తానన్న జగన్‌..... అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా ఉద్యమం చేశారా అని షర్మిల ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు వేయడానికి, జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని..షర్మిల విమర్శించారు. ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడమే తప్పు అభివృద్ధి కనిపించడం లేదని మండిపడ్డారు. మణిపుర్‌లో క్రైస్తవులపై దాడులు చేస్తే క్రైస్తవుడైన జగన్‌రెడ్డి స్పందించలేదని ధ్వజమెత్తారు. అంతకుముందు విజయవాడ విమానాశ్రయం నుంచి కానూరుకు ప్రదర్శనగా వెళ్తున్న షర్మిల కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఎనికేపాడు వద్ద వాహనాలను మళ్లించారు. పోలీసుల తీరును ఖండిస్తూ.. కాంగ్రెస్‌ శ్రేణులు రహదారిపై బైఠాయించి..నిరసన తెలిపారు.



ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల భారం రూ.10 లక్షల కోట్లపైనే చేరుకుందని... ఏమైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దంలో వెతికినా కనిపించదని షర్మిల విమర్శించారు. "రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. విజయవాడలో కాదు కదా ఎక్కడా ఒక్క మెట్రో కూడా లేదు. పదేళ్లలో పది పెద్ద పరిశ్రమలైనా వచ్చాయా? కనీసం రోడ్లు వేయడం లేదు. ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వడం లేదు.” అని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని... వైసీపీ , టీడీపీ.. బీజేపీ జెండాలు పట్టుకోవడం కాదని... రాష్ట్రానికి ఏం చేశారో చెప్పమనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లక్షలమందికి ఉద్యోగాలిస్తామన్న జగన్‌... ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని షర్మిల నిలదీశారు. అప్పులేని రైతులెవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story