Chandrababu Naidu : పోలవరంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు

రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి రాష్ట్రానికి శాపంగా మారారని వైసీపీ చీఫ్ జగన్ పై సీఎం చంద్రబాబు ( CM Chandrababu Naidu ) ఫైరయ్యారు. పోలవరం విషయంలో ఆయన క్షమించరాని తప్పులు చేశారని మండిపడ్డారు. 'వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారు. డయాఫ్రమ్ వాల్ను కాపాడుకోలేదు. రూ.446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదు. నేను గతంలో ప్రాజెక్టుపై వందసార్లు సమీక్షించా.. 30 సార్లు సందర్శించా' అని తెలిపారు.
తెలంగాణ నుంచి 7 మండలాలు వచ్చినందునే పోలవరం మొదలుపెట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టు సందర్శన అనంతరం మాట్లాడుతూ.. ‘పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారు. టీడీపీ హయాంలోనే 72% పూర్తి చేశాం. 15లక్షల క్యూసెక్కులు స్పిల్ వేపై డిశ్చార్జ్ అవుతాయి. చైనాలో త్రీగోర్జెస్ డ్యామ్ కంటే ఎక్కువ ప్రవాహం ఉన్న ప్రాజెక్టు ఇది. రాయలసీమకూ గోదావరి జలాలు తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది’ అని పేర్కొన్నారు.
ఎలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదో ఇదొక కేస్ స్టడీ. రూ.వేల కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది. అప్పుడే ప్రాజెక్టు చేపడితే తక్కువ ఖర్చుతో పూర్తయ్యేది. ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరిగింది. నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీని మార్చవద్దని కేంద్రం రాష్ట్రానికి చెప్పింది. అలా మార్చితే ప్రాజెక్టుకు జవాబుదారీతనం ఉండదని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com