AP: ఏపీలో పతాకస్థాయికి చేరుకున్న ప్రచారం

AP: ఏపీలో పతాకస్థాయికి చేరుకున్న ప్రచారం
కూటమి అభ్యర్థులకు ప్రజలుబ్రహ్మరథం....కూటమి మేనిఫెస్టోపై మహిళల విస్తృత చర్చ

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ తేదీ సమీపించే కొద్దీ ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కూటమి అభ్యర్థులు ఎక్కడ ప్రచారానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పూల వర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలుకుతున్నారు. తెలుగుదేశం సూపర్‌ సిక్స్‌ పథకాలు, కూటమి మేనిఫెస్టో గురించి మహిళలు, వృద్ధులు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని గ్రామాల్లో కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ ప్రచారం చేశారు. మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామస్థులు ఆయన వెంట తిరుగుతూ కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కూటమి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ఓబుళదేవరచెరువు మండలంలో రోడ్‌షో నిర్వహించారు. అక్కడి ప్రజలు సింధూరారెడ్డిపై పూలు చల్లుతూ, హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. పసుపు జెండాలు చేతపట్టి గ్రామాల్లో తిరిగారు.


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకత చాటుకున్నారు. వార్డుల్లో మహిళలతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం సూపర్‌ సిక్స్ పథకాలకు మహిళల నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రజల ఆస్తిపత్రాలపై తన బొమ్మ ముద్రించుకున్న జగన్ కు... ఎన్నికల్లో సమాధి కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని... గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తాడికొండలో కూటమి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్తును జగన్ నాశనం చేశారని పెమ్మసాని ధ్వజమెత్తారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పోస్టాఫీసు ఉద్యోగులతో మాటామంతీ నిర్వహించారు. సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ బూటకపు నిర్ణయాల్లో భూహక్కు చట్టం ఒకటని సుజనా అన్నారు.


N.T.R. జిల్లా నందిగామ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య తరఫున సినీ నటుడు నారా రోహిత్‌, హాస్య నటుడు రఘు ప్రచారం చేశారు. నియోజకవర్గంలోని చందర్లపాడులో నిర్వహించిన రోడ్‌షోలో గ్రామస్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌, మచిలీపట్నం పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి బాలశౌరి నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లో ప్రచారం చేశారు. పడవపై గ్రామానికి వెళ్లిన వారికి... స్థానికులు ఘన స్వాగతం పలికారు. కూటమి నాయకులు, కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తర్వాత గ్రామస్థులతో సమావేశమైన నేతలు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story