CBN: నేడే రా కదిలి రా ముగింపు సభ

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న 'రా కదలిరా' ముగింపు సభను ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 23 చోట్ల ఈ సభలు జరిగాయి. చివరి సభను పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో తెలుగుదేశం నిర్వహిస్తున్న "రా కదలిరా" ముగింపు సభకు సర్వం సిద్ధమైంది. హిందూపురం పార్లమెంటు పరిధిలో నిర్వహిస్తున్న 24వ కార్యక్రమాన్ని ముగింపు సభగా పార్టీ ప్రకటించింది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కియా... దాని అనుబంధ పరిశ్రమలకు మధ్య తెలుగుదేశం పార్టీ పెనుకొండ అభ్యర్థి సవితకు చెందిన సొంత భూమిలో సభ నిర్వహించనున్నారు. చంద్రబాబు నాయుడితోపాటు సభకు హాజరయ్యే ప్రజలకు కియా ప్రధాన పరిశ్రమతో పాటు, అనుబంధ పరిశ్రమలు కనపడేలా సభావేదికను తీర్చిదిద్దారు
ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో బయలు దేరి ఎర్రమంచికి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు సభావేదిక వద్దకు రానున్నారు. అభివృద్ధి ఊసే లేకుండా ఐదేళ్లు యువతకు ఉద్యోగ, ఉపాధి లేకుండా చేసిన విషయాన్ని...చంద్రబాబు వివరించనున్నారు. కియా పరిశ్రమ ఏర్పాటుతో కరవు ప్రాంతంలో భూముల ధరలు పెరిగి... గ్రామీణుల ఆర్థికాభివృద్ధి జరిగిన పరిస్థితులను చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు తెలియజేయనున్నారు. ఈ సభ ద్వారా మరోసారి ప్రజలకు భవిష్యత్ ప్రణాళికను వివరించనున్నట్లు తెలుగుదేశం నేతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు సభకు హిందూపురం పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున ప్రజలు రానున్నారు. శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.CBN: నేడే రా కదిలి రా ముగింపు సభ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com