AP: కౌంటింగ్‌ వేళ వైసీపీ ఘర్షణలకు దిగే అవకాశం

AP: కౌంటింగ్‌ వేళ వైసీపీ ఘర్షణలకు దిగే అవకాశం
X
అప్రమత్తంగా ఉండాలని కూటమి నేతల పిలుపు... సంయమనంతో వ్యవహరించాలని సూచన

ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు రోజు వైసీపీ నేతలు ఘర్షణలకు యత్నించే అవకాశముందని కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా గొడవలకు దిగినా కూటమి నేతలు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. ఫలితాల రోజు భద్రతపై దృష్టి సారించాలని అధికారులను కోరారు. రేపు ఓట్ల లెక్కింపు సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై జాగ్రత్త వహించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్‌కు కూటమి నేతలు విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ జరిగే సమయంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువ శాతం నమోదు కావడంతో... వైసీపీ అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. కౌంటింగ్ సమయంలో వైసీపీ గొడవలకు దిగే అవకాశం ఉందని...దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ను కోరారు.


కౌంటింగ్ రోజు అల్లరిమూకలు తెనాలిలో ఘర్షణలకు దిగేందుకు ప్రయత్నిస్తున్నాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరు గొడవలకు దిగినా... వెంటనే అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా... చంద్రబాబు సీఎం అవుతున్నారని... కర్నూలు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే కూటమికి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయని సంతోషం వ్యక్తంచేశారు. కౌంటింగ్ సందర్భంగా వైసీపీ నేతలు రెచ్చగొట్టినాకార్యకర్తలు గొడవలకు దూరంగా ఉండాలన్నారు.

తెలుగుదేశం తరఫున ఏజెంట్లుగా ఉంటే తీవ్ర పరిణామాలుంటాయని కొందరు పోలీసు అధికారులు బెదిరిస్తున్నారని తెలుగుదేశం నేత వర్ల రామయ్య మండిపడ్డారు. బెదిరించే పోలీసు అధికారులను డీజీపీ, సీఈవో కట్టడి చేయాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను ఉన్నతాధికారులు కాపాడాలని కోరారు. ఏపీలో N.D.A. కూటమి వస్తుందని దాదాపు అన్ని సర్వేలు తేల్చాయని బీజేపీ నేత C.M. రమేశ్‌ అన్నారు. జగన్‌ పాలనలో విసిగిపోయిన ప్రజలు కూటమికి మద్దతిచ్చారని తెలిపారు. తప్పుడు సర్వేలతో తప్పుదోవ పట్టించాలని వైసీపీ యత్నిస్తోందన్నారు. లెక్కింపు వేళ తగాదాలకు వైసీపీ శ్రేణులు యత్నిస్తున్నాయని.... అంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Tags

Next Story