YCP: వైసీపీని వెంటాడుతున్న వలసల భయం

YCP: వైసీపీని వెంటాడుతున్న వలసల భయం
ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు... జగన్‌ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీని వలసల భయం వెంటాడుతోంది. ప్రకాశం జిల్లాలో నిన్న, మొన్నటి వరకు వైసీపీలో కీలక పాత్ర పోషించిన నేతలు ఒక్కొక్కరూ తెలుగుదేశం గూటికి చేరుతున్నారు. నిరంకుశత్వం, వర్గపోరు, కుల రాజకీయాలతో విసుగెత్తిపోయి... జెండాలు మార్చేస్తున్నారు. మరోవైపు వెళ్లిపోయిన వారిని పార్టీలోకి తిరిగి తెచ్చుకునేందుకు వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రోజురోజుకీ వైసీపీ నుంచి వలసలు పెరిగిపోతున్నాయి. ప్రకాశం జిల్లాలో వైసీపీకి బలమైన నాయకులు భావించిన చాలామంది పార్టీకి గుడ్‌ బై చెబుతున్నారు. పార్టీ విధానాలు, స్థానిక రాజకీయాలతో విసుగెత్తిపోయి ద్వితీయ స్థాయి నాయకుల నుంచి కార్యకర్తల వరకూ... తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటున్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డే పార్టీలో ఇమడలేకపోతే తామెంత అంటూ జెండా మార్చేస్తున్నారు.

ఇప్పటికే లోక్‌సభ పరిధిలోని ద్వితీయ శ్రేణి నాయకులంతా.. మాగుంటతో పాటు తెలుగుదేశంలో చేరారు. దర్శి అసెంబ్లీ టికెట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాలరావుకి కాకుండా సీఎం తన సొంత సామాజిక వర్గ నేత బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కట్టబెట్టారు. దీంతో పార్టీని వీడకపోయినా తన మద్దతు తెలుగుదేశానికే ఉంటుందని.. మద్దిశెట్టి కేడర్‌కి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్‌ తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మితో సమాలోచనలు చేశారు. దీంతో గ్రామాల్లో మద్దిశెట్టి వర్గానికి చెందిన నాయకులంతా వైకాపాను వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటున్నారు. వైసీపీకి మంచి పట్టున్న తాళ్లూరు మండలంలోనూ వలసలు కొనసాగుతున్నాయి. ఎంపీపీ తాడికొండ శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేసి.. తెలుగుదేశంలో చేరుతున్నట్లు ప్రకటించారు.

ఒంగోలులో పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పార్టీ మీద, సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మీద అసంతృప్తితో ప్రతీ రోజూ వైకాపాను వీడుతున్నవారి సంఖ్య పెరిగిపోతుంది. 2019లో ఎన్నికల్లో బాలినేనికి అండగా నిలిచి... ఎన్నికల వ్యవహారాలన్నీ భుజాల మీద వేసుకున్న పలువురు నాయకులు.... పార్టీకి గుడ్‌ బై చెబుతున్నారు. కర్నూలు రోడ్డు, గద్దలగుంట, వడ్డిపాలెం, ఇస్లాంపేట, తదితర ప్రాంతాల్లోని ప్రధాన సామాజిక వర్గాల నాయకులు వైకాపాని వీడి తెలుగుదేశం గూటికి చేరుతున్నారు. నగరంలో అత్యధిక ఓట్లు ఉన్న37వ డివిజన్‌ సుజాత నగర్‌ కార్పరేటర్‌ సైతం పసుపు కండువా కప్పుకున్నారు. ఒంగోలు, కొత్తపట్నం మండలాల్లోని సర్పంచులు, వార్డు సభ్యులు సైకిల్‌ ఎక్కారు. కనిగిరిలోనూ వైకాపా నుంచి వలసలు పెరిగిపోతున్నాయి. అసెంబ్లీ టికెట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌కు టికెట్‌ ఇవ్వకుండా... కొత్త అభ్యర్థి నారాయణకి ఇవ్వడంతో ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి కార్యకర్తల వరకు తెలుగుదేశం తీర్థం పుచ్చుకంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story