మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ( Pinnelli Ramakrishna Reddy ) మాచర్ల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు, కారంపూడి సీఐపై దాడి కేసుల్లో రిమాండ్ విధించగా.. ఈవీఎం ధ్వంసం, మహిళపై దాడి కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించారు.
పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో పిన్నెల్లి అనుచరులు, అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు పిన్నెల్లి వ్యతిరేక వర్గం బాణసంచా కాల్చింది. దీంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. కాగా EVM ధ్వంసం, CIపై దాడి కేసులో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే శిక్ష తప్పదని ఈసీ హెచ్చరించింది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టే దీనికి నిదర్శనమని పేర్కొంది. ఎన్నికల్లో దుశ్చర్యలకు పాల్పడకుండా ఈ అరెస్టు ఓ గుణపాఠమని తెలిపింది. మాజీ ఎమ్మెల్యే అరెస్టుతో ఘటనకు తార్కిక ముగింపు లభించిందని పేర్కొంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, ప్రజాస్వామ్యాన్ని బెదిరించే వారిపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.