గోదావరికి వరద పోటెత్తుతోంది. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 10.80 అడుగులకు చేరడంతో అధికారులు 175 గేట్లను ఎత్తారు. 3లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బ్యారేజీ నీటిమట్టం 11.75 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. అటు వరద ఉద్ధృతి నేపథ్యంలో లంక గ్రామాలను అప్రమత్తం చేశారు. మరోవైపు గోదావరికి వరద పెరగడంతో దేవీపట్నం గండిపోచమ్మ ఆలయం నీట మునిగింది.
మరోవైపు ఉమ్మడి తూ.గో జిల్లాలోని రాజమండ్రి, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో సుమారు 7వేల ఎకరాల్లో వరినాట్లు, నారుమళ్లు నీటమునిగాయి. అటు కోనసీమ జిల్లాలోని రాజోలు, ముమ్మిడివరం, బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. పలు గ్రామాల మధ్య వాగులు పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.