CBN: అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం
జగన్ పాలనలో అమరావతి పూర్తిగా విధ్వంసం... ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి;
జగన్ విధ్వంస పాలనలో నిర్వీర్యం అయిన అమరావతిని చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఏపీ అని పిలుస్తారని... దీనిలో ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్టులకూ అంత ప్రాధాన్యం ఉందన్నారు. జగన్ మూర్ఖత్వం వల్ల ఈ రెండు ప్రాజెక్టులు విధ్వంసానికి గురయ్యాయని ధ్వజమెత్తారు. పోలవరం, అమరావతి.. సంపద సృష్టి కేంద్రాలని, వాటివల్ల మొత్తం సమాజానికే మేలు జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు దిక్సూచిలా ఉండాల్సిన ఐదేళ్లపాటు అమరావతిలో జగన్ చేసిన విధ్వంసంపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. అమరావతిలో ఎంత నష్టం జరిగింది? నిర్మాణాలు ఎంతవరకు పనికొస్తాయి? అనే దానిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
తాను పారిపోవడానికి సిద్ధంగా లేనని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటానని, ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మిస్తానని చంద్రబాబు హామీనిచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి నిర్మాణాన్నీ పూర్తిచేస్తామని తెలిపారు. ఆంధ్రుల రాజధాని అమరావతిలో పర్యటించిన చంద్రబాబు... జగన్ పాలనలో విధ్వంసానికి గురైన కట్టడాల్ని పరిశీలించారు. ఈ ఐదేళ్లూ పనులు కొనసాగించి ఉంటే అమరావతి నిర్మాణం కొలిక్కి వచ్చేదని. కానీ ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయొచ్చో అన్నీ చేశారు. ఆ భవనాల్ని, కట్టడాల్ని రైతులు ఎంతగా కాపాడాలనుకున్నా పోలీసులు వాళ్లపైనే కేసులు పెట్టారు. రాజధాని నిర్మాణానికి గుత్తేదారులు తెచ్చిన మెటీరియల్, పైపులు, ఇసుక దోచుకుపోయారు. రోడ్లను తవ్వేసి కంకర కూడా పట్టుకుపోయారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని ప్రాంతమంతా తుమ్మచెట్లు పెరిగిపోయి అడవిలా మారిపోయిందని, ఎక్కడ ఏ నిర్మాణాలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొందని చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే టెండర్లు పిలిచి తుమ్మచెట్లు తొలగించే పనిని వెంటనే చేపట్టాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం 1,631 రోజులపాటు అక్కడి ప్రజలు, రైతులు ఉద్యమించడం ఒక చరిత్రగా ఆయన అభివర్ణించారు. శంకుస్థాపన స్థలం వద్ద ఏర్పాటుచేసిన చిహ్నాల్ని వైకాపా పాలనలో కొందరు దుండగులు ధ్వంసం చేసినా, పవిత్రమైన మట్టిని రైతులు కాపాడారన్నారు. అప్పట్లో యజ్ఞం చేసినచోట 1,631 రోజులుగా పూజలు చేస్తూ... ఆ మహిమను వారు కాపాడారని, అదే ఈ రోజు అమరావతికి రక్షణగా నిలిచిందని చంద్రబాబు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చినవాళ్లు ఎవరైనా మంచి పనులతో పరిపాలన ప్రారంభిస్తారని, కానీ 2019లో జగన్ ప్రజావేదిక విధ్వంసంతో పరిపాలన ప్రారంభించారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పారని.. వైసీపీకి 11 సీట్లే వచ్చాయంటే, ఆ దుష్టపాలనకు ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో అర్థమవుతోందన్నారు.