SHARMILA: మమ్మల్ని రోడ్డున పడేసింది ఎవరు..?
జగన్‌కు షర్మిల సూటి ప్రశ్న.... జగన్, అవినాష్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం;
వైఎస్సార్ కుటుంబ మహిళల్ని రోడ్డునపడేలా చేసిందెవరో ప్రజలు గుర్తించాలని షర్మిల, సునీత కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా... జగన్, అవినాష్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ PCC అధ్యక్షురాలు, కడప లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల... YSR జిల్లాలో నాలుగో రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠంలో నిర్వహించిన ప్రచారంలో వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా పాల్గొన్నారు. వైఎస్సార్ ఆశయాలు నెరవేర్చని జగన్. ఆయనకు వారసుడెలా అవుతారని షర్మిల ప్రశ్నించారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన సమాజం అందించాలంటే.. వైసీపీని జగన్‌ను ఓడించాలని వివేకా కుమార్తె సునీత ప్రజలను అభ్యర్థించారు. ఆధారాలున్నా సొంత బాబాయిని హత్య చేసిన నిందితులను జగన్ కాపాడుతున్నారని.. షర్మిల ఆరోపించారు.
వైసీపీ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని షర్మిల అన్నారు. ధరల స్థిరీకరణ అని చెప్పి జగన్ మోసం చేశారన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో రైతు రారాజు.. ఇప్పుడు అప్పులేని రైతే లేడని మండిపడ్డారు. పంట నష్టం జరిగితే రూపాయి కూడా పరిహారం రావడం లేదని...డ్రిప్ వేసుకోవడానికీ అవకాశం లేకుండా సబ్సిడీలన్నీ జగన్ ప్రభుత్వం ఆపేసిందని షర్మిల మండిపడ్డారు. "సంపూర్ణ మద్య నిషేధం హామీ ఇచ్చారు.. కానీ ప్రభుత్వమే విక్రయిస్తోంది. ఇష్టారీతిన అమ్ముతున్నారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. మెగా డీఎస్సీ వేస్తామని చెప్పారు. నాలుగున్నరేళ్లు నిద్రపోయి కేవలం 6వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. జగన్‌ది హత్యా రాజకీయాలు చేసే పాలన. సొంత బాబాయిని చంపిన నిందితులను కాపాడుతున్నారు. నిందితుడిగా ఉన్న అవినాష్‌కే మళ్లీ టికెట్ ఇచ్చారు. అతడు చట్టసభల్లోకి వెళ్లకూడదు. అన్యాయాన్ని ఎదిరించేందుకే ఎంపీగా పోటీచేస్తున్నా. న్యాయం కోసం పోరాటం ఓ వైపు.. హంతకులు మరో వైపు.. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో ఆలోచించాలి. హంతకులకు ఓటు వేయొద్దు. వైఎస్‌ఆర్ బిడ్డను గెలిపించాలని కోరుతున్నా. ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటా’’ అని షర్మిల అన్నారు.
ఆడది అంటే నారీ శక్తి అని వివేకా కుమార్తె సునీత అన్నారు. తమను అలాగే పెంచారని చెప్పారు. షర్మిలతో కలిసి బస్సుయాత్రలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ‘‘తప్పు అంటే తప్పు అని చెప్పే మనస్తత్వం మాది. వివేకాను ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసు. న్యాయం కోసం పోరాడుతున్నాం. ఆయన్ను చంపి మమ్మల్ని రోడ్ల పాల్జేశారు. షర్మిలను ఎంపీగా చూడాలనేది వివేకా కోరిక. ప్రజలు భారీ మెజారిటీతో ఆమెను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని సునీత అన్నారు.