Andhra Pradesh: ఏపీకి తుఫాన్‌ ముప్పు.. ఆరోజు నుండే భారీ వర్షాలు..

Andhra Pradesh: ఏపీలో తుఫాన్‌ వస్తుందని, దీనివల్ల భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Update: 2022-05-07 11:00 GMT

Andhra Pradesh: ఏపీకి తుఫాన్‌ ముప్పు పొంచి ఉంది. ఈనెల 10 నాటికి తుఫాన్‌ వస్తుందని, దీనివల్ల భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.దక్షిణ అండమాన్‌ సముద్రంలో వున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్యంగా పయనించి సాయంత్రానికి వాయుగుండంగా బలపడుతుంది.

ఆ తరువాత వాయువ్యంగా పయనించి రేపు సాయంత్రం తూర్పుమధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి తుఫాన్‌గా మారుతుంది. తుఫాన్‌గా మారిన తరువాత కూడా వాయువ్యంగా పయనించి 10వ తేదీకి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరం దిశగా రానుంది. అయితే.. బంగాళాఖాతంలో నిన్నటి వరకు ఉన్న వాతావరణ పరిస్థితులే ఈ నెల 10 వరకూ కొనసాగితే ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరంలో తుఫాన్‌ తీరం దాటుతుందని వాతావరణ నిపుణులు అంటున్నారు.

ఒకవేళ తుఫాన్‌ పయనించే క్రమంలో మరింత బలపడితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి వచ్చిన తరువాత.. దిశ మార్చుకుని పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ దిశగా వెళుతుందని అంచనా వేశారు. తుఫాన్‌ హెచ్చరికతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది.

తీర, మధ్య ప్రాంత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. తుఫాన్‌ ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక.. సకాలంలో కేరళకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్‌లు నైరుతి రుతుపవనాల రాకపై ప్రభావం చూపుతాయని వాతావరణ నిపుణులు అంటున్నారు.

Tags:    

Similar News