తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సోమవారం ఉదయం దర్శించుకున్నారు. కొద్ది రోజుల క్రితం సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయట పడడంతో స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకుని గాయిత్రి నిలయంలో బసచేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు వేద పండితులు ఆశీర్వచనం పలుకగా టిటిడి అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందచేశారు. అనంతరం శ్రీవారి ఆలయంకు ఎదురుగా ఉన్న అఖిలాండం వద్దకు చేరుకుని హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మాతృశ్రీ తరిగొండవెంగమాంబ అన్నప్రసాద భవనం చేరుకుని కుమారుడు మార్క్ శంకర్ పేరిట రూ.17 లక్షల విరాళాన్ని టిటిడి అధికారులకు అందించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలను స్వయంగా వడ్డించి తాను సహపంక్తిలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు.