AP: ఏపీలో నేటి నుంచే ఆటో డ్రైవర్ సేవలో
కాసేపట్లో కొత్త పథకం ప్రారంభించనున్న కూటమి సర్కార్.. విజయవాడలో "ఆటో డ్రైవర్ సేవలో.." ఆరంభం.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు, పవన్, లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసింది. నేడు మరో కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొస్తుంది. రాష్ట్రంలోని డ్రైవర్ల సంక్షేమం కోసం ‘ఆటో డ్రైవర్ సేవలో…’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఏపీలో సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించనుంది. అయితే, ఈ ఆటో డ్రైవర్ సేవలో పథకాన్నినేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరు కానున్నారు. భారీ సంఖ్యలో ఆటో డ్రైవర్లు కూడా ఈ సభలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.
ప్రతి ఏటా ఒక్కొక్కరికి రూ. 15 వేలు
ఏపీలోని ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా రూ.15వేలు చొప్పున అందజేయనున్నారు. సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ఆటో డ్రైవర్ సేవలో పథకం రూపొందించింది. ఈ పథకం కింద మొత్తం 3,10,385 మంది అర్హుల జాబితా సిద్ధం చేశారు. క్షేత్ర స్థాయి పరిశీలన తరువాత అర్హుల జాబితా ఖరారు చేశారు. ఏపీ ప్రభుత్వంపై రూ.466 కోట్ల భారం పడనుంది. స్త్రీ శక్తి పథకం వల్ల జీవనోపాధి ఇబ్బంది ఎదురైన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం స్టేటస్ చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆటో డ్రైవర్ల కోసం ప్రారంభించబోతున్న పథకం జాబితాలో పేరు ఉందో లేదో స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ పథకం స్టేటస్ చెక్ చేయడానికి లాగిన్ అవసరం లేదు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆధార్ కార్డ్ నంబర్‌తో చెక్ చేసుకోవచ్చు. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు కేవలం ఏడాదికి రూ.10 వేలు మాత్రమే ఇచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం గత పాలకులకంటే 50 శాతం అదనంగా రూ.15 వేలు ఇస్తోంది.
భారీగా పెరిగిన లబ్దిదారుల సంఖ్య
గత ప్రభుత్వంలో 2,61,516 మందిని అర్హులుగా గుర్తించి రూ.261.51 కోట్లే ఖర్చు చేయగా.. ఈసారి లబ్ధిదారుల సంఖ్య మరో 30 వేలు పెరిగింది. అలాగే డ్రైవర్లకు రూ.175 కోట్లు అదనంగా లబ్ధి చేకూరనుంది. ఈ పథకంలో ఆటో డ్రైవర్లు 2,25,621 మంది, త్రీ వీలర్ ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు 38,576 మంది, మోటార్ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది ఉన్నారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 22,955 మంది డ్రైవర్లకు లబ్ధి కలగనుంది. ఈ పథకం అమలు సందర్భంగా అధికారులు, డ్రైవర్ సంఘాలు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం పెంచి దీన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. అర్హతల విషయంలో జాగ్రత్తగా పరిశీలన చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందాలని పేర్కొన్నారు.
విశాఖలోనే అత్యధికం
విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 22, 955 మంది డ్రైవర్లకు లబ్ధి చేకూరగా.. ఫిర్యాదుల కోసం ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం అందేలా చేయాలని అధికారులకు సర్కార్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అర్హత ఉండి కూడా జాబితాలో పేరు లేకుంటే.. వారి సమస్యను పరిష్కరించిన వెంటనే లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేయగా.. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది.