AP: అమరావతి నిర్మాణాన్ని పరిగెత్తిస్తాం

రెండున్నరేళ్లలో రాజధాని అమరావతి కోర్‌ కేపిటల్‌ నిర్మాణం పూర్తి... బాధ్యతలు స్వీకరించిన అనంతరం నారాయాణ;

Update: 2024-06-17 02:00 GMT

ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులు పరుగులెత్తిస్తామని...రెండున్నరేళ్లలో కలల రాజధాని సాకారం చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు. రెండున్నరేళ్లలో రాజధాని అమరావతి కోర్‌ కేపిటల్‌ నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. త్వరలోనే పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణ...తొలిరోజు అన్నక్యాంటీన్ల పునః ప్రారంభించడంపై సమీక్షించారు. మూడు వారాల్లో అన్నక్యాంటీన్ల ద్వారా పేదలకు భోజనం పెడతామని హామీ ఇచ్చారు. సచివాలయంలో రెండో బ్లాక్‌లో తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఆయన్ను..రాజధాని రైతులు అభినందించారు.


పాత మాస్టర్ ప్లాన్‌ ప్రకారమే నిర్మాణ పనులు కొనసాగుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 48వేల కోట్లతో తొలిదశ నిర్మాణ పనులు చేపట్టామని...ప్రపంచంలోనే తొలి ఐదు రాజధానుల్లో ఒకటిగా నిలిచేలా పనులు మొదలు పెట్టామని ఆయన గుర్తుచేసుకున్నారు. రాజధాని రైతులకు గతంలో తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని నారాయణ అన్నారు. అమరావతిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలు నిర్మాణం పూర్తయిందని... రోడ్లు, డ్రైనేజీ సహా ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాజధానిలో రోడ్లు ధ్వంసం సహా దోపిడీలపై కమిటీపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అన్నక్యాంటీన్‌పై సమీక్షించిన నారాయణ మూడువారాల్లో తిరిగి క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్‌కు భోజన సరఫరా బాధ్యతలు అప్పగించడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామన్నారు. అన్న క్యాంటీన్లలో ఉన్న సచివాలయాలను వేరే ప్రాంతానికి తరలిస్తామన్నారు. వైసీపీతో అంటకాగిన అధికారులను దూరం ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశాలనుసారం పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక సీఎస్‌ శ్రీలక్ష్మీ తీసుకొచ్చిన ఫైల్‌ను నారాయణ సున్నితంగా తిరస్కరించారు. మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫైల్‌పై సంతకం కోసం శ్రీలక్ష్మీ ప్రయత్నించగా...ఇప్పుడు అలాంటివేమీ వద్దంటూ తిప్పిపంపారు. 

Tags:    

Similar News