CBN: ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు..!
ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన బీజేపీ... చంద్రబాబు షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం;
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20వ తేదీన ఢిల్లీ నూతన సీఎం ప్రమాణం చేయనున్నారు. సీఎంతో పాటు కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రమాణం చేయనున్నారు. సరిగ్గా సాయంత్రం 4:30 గంటలకు ప్రమాణ స్వీకారం జరగనుంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అగ్రనేతలు అందరూ ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొననున్నట్లు కమలం పార్టీ వెల్లడించింది. రాజధానిలోని రాంలీలా మైదానంలో ముఖ్యమంత్రితోపాటు మంత్రిమండలి కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అతిరథ మహారథులను ఆహ్వానించి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని ఫిబ్రవరి 20న చేపట్టాలని కమలనాథులు భావిస్తున్నారు.
అతిరథ మహారథులు
రాంలీలాలో జరిగే ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు 50 మందికిపైగా హై సెక్యూరిటీ నాయకులు హాజరవుతారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నాయకులతో సహా అగ్ర బీజేపీ నాయకులను ఆహ్వానించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం రానప్పటికీ షెడ్యూల్ అయితే ఖరారు అయినట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ ఎన్నికల సమయంలో తెలుగు వారు ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేశారు. అక్కడ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించారు.
పర్వేశ్ వర్మ.. ? రేఖా గుప్తా..?
ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చల తర్వాత దీనిపై బీజేపీ అధిష్టానం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే, కేజ్రీవాల్ పై ఘన విజయం సాధించిన పర్వేశ్ వర్మ పేరు ముఖ్యమంత్రిగా ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సీఎంగా మహిళకు అవకాశం ఇవ్వాలని భావిస్తే మాత్రం రేఖా గుప్తాకు చాన్స్ దక్కవచ్చని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.