CBN: పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగిస్తాం
కొత్త పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెస్తాం.... చంద్రబాబు స్పష్టీకరణ;
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పలు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాల్ని పరిశీలించి.. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అత్యుత్తమ పాలసీని తెస్తామని వెల్లడించారు. గత పదేళ్లలో వివిధ సంస్థలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల్లో ఎన్ని వాస్తవ రూపం దాల్చాయి... మిగతా వాటి పరిస్థితి ఏమిటి... అనే అంశాలను పరిశ్రమల శాఖ అధికారులతో సీఎం సచివాలయంలో సమీక్షించారు. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి రావాలంటే భయపడ్డారు. రాజకీయంగా వేధించడంతో చాలా సంస్థలు పెట్టుబడుల ఒప్పందాల్ని రద్దు చేసుకున్నాయి. కొత్తవి రాలేదని చంద్రబాబు అన్నారు.
పారిశ్రామిక వేత్తల్లో మళ్లీ నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. గత దశాబ్దకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన పెట్టుబడులు ఎన్ని? కుదిరిన ఒప్పందాల ప్రస్తుత పరిస్థితి ఏమిటి? వివిధ పరిశ్రమలకు కేటాయించిన భూముల పరిస్థితి? తదితరాలపై అధికారుల నుంచి వివరాలను తెలుసుకున్నారు. రాబోయే ఐదేళ్లలో పారిశ్రామిక విధానం ఎలా ఉండాలనే దానిపై వారికి స్పష్టత ఇచ్చారు. ఏపీలో కొత్తగా కుప్పం, మూలపేట, చిలమత్తూరు, దొనకొండ దగ్గర నాలుగు పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వాటిలో ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, హార్డ్‌వేర్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామని సీఎం చెప్పారు.
రాబోయే 100 రోజుల్లో ఐదు కొత్త పాలసీలు తీసుకొస్తామని చంద్రబాబు వెల్లడించారు. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్‌ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ అండ్ క్లౌడ్, టెక్స్‌టైల్ పాలసీల్ని రూపొందిస్తున్నామని వెల్లడించారు. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాలు.. పెట్టుబడుల్ని ఆకర్షించేలా వీటిని తీసుకొస్తామని తెలిపారు. పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని చంద్రబాబు వెల్లడించారు. 15 రోజుల్లో పారిశ్రామిక డ్రాఫ్టు పాలసీ తయారవుతుంది. దానిపై భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తీసుకుని తుది విధానాన్ని రూపొందిస్తామని వివరించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంగా విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తమ ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య రూ.16 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాల్ని కుదుర్చుకున్నామని చంద్రబాబు తెలిపారు. వైసీపీ సర్కారు వ్యవహరించిన తీరుతో పారిశ్రామికవేత్తలు ఆ ఒప్పందాల్ని రద్దు చేసుకున్నారని గుర్తు చేశారు.