CBN:రైతులందరికీ రూ.20వేలు సాయం

మధ్యతరగతి ప్రజలకు రూ.2.50 లక్షల వైద్యబీమా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన;

Update: 2025-03-02 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ‘అన్నదాతా సుఖీభవ- పీఎం కిసాన్‌’ పథకం కింద ప్రతి రైతుకూ రూ.20వేలు సాయమందిస్తామని ప్రకటించారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో పేదల సేవలో కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. బీసీ కాలనీలో ఇంటికి వెళ్లిన చంద్రబాబు వారికి స్వయంగా పింఛన్లు అందజేశారు. వసంతమ్మ తనకు సొంతిల్లు లేదని చెప్పగా మూడు సెంట్ల స్థలం ఇవ్వడంతోపాటు ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. చిన్న కుమార్తె చదువుకు రూ.50వేల ఆర్థికసాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి... ప్రజా వేదికలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

వెలుగులు నింపాలన్నదే నా కోరిక

‘గడిచిన ఐదేళ్లలో ప్రజలు ఎన్నో బాధలు పడ్డారు. ఇప్పుడు ప్రజలు ఆనందంగా ఉన్నారు. పేదల జీవితాల్లో వెలుగు నింపాలన్నదే నా కోరిక. ఎన్డీఏ కూటమిని గెలిపించి ప్రజలు మంచి పని చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పు రాష్ట్రానికి సంజీవనిగా మారింది. వైసీపీ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది. ఇప్పుడు అప్పు అడిగినా ఎవరూ ఇవ్వడంలేదు’ అని చంద్రబాబు తెలిపారు. దంపతులు ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లల్ని కనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. జనాభా తగ్గిపోతోందని... ప్రపంచం ముసలిదైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలే భావితరానికి ఆస్తి అని చంద్రబాబు అన్నారు. అందుకే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా వారందరికీ ‘తల్లికి వందనం’ పథకం కింద ఏడాదికి రూ.15వేల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చామని గుర్తు చేశారు.


ఆలోచనంతా సంపద సృష్టిపైనే

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. సంపద ఎలా సృష్టించాలి అనేదానిపైనే నిత్యం ఆలోచిస్తున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 12.9 శాతం వృద్ధిరేటు సాధించామని గుర్తు చేశారు. మరో 2 నెలల్లో రోడ్లపై గుంతలు పూడ్చడం పూర్తవుతుందని తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో నాలుగు వరుసల్లో కొత్త రోడ్లు వేస్తున్నామని... అమరావతిని మళ్లీ పట్టాలెక్కించామన్నారు.

ఇక గ్యాప్ రాదు: చంద్రబాబు

అధికారం చేపట్టిన తర్వాత కార్యకర్తలతో మాట్లాడలేకపోయానని... పార్టీ కార్యకర్తలతో మాట్లాడి 9 నెలలు అయ్యిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు కార్యకర్తలను కలిశానని... రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ రాదని హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో పెన్షన్ పంపిణీ తర్వాత.. కార్యకర్తలతో భేటీ అయ్యారు. పేదల జీవితాల్లో వెలుగులు రావాలన్నదే తన కోరిక అని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News