AP: ఢిల్లీలో కొత్త యుగం ఆరంభం: చంద్రబాబు

పవన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రధాని మోదీ... చంద్రబాబు, పవన్ కు షేక్ హ్యాండ్;

Update: 2025-02-20 09:30 GMT

దేశ రాజధానికి కొత్త యుగం ఆరంభమైందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇప్పటినుంచి ఢిల్లీని విభిన్నంగా చూడబోతున్నారని వెల్లడించారు. ఢిల్లీలో అద్భుతమైన అభివృద్ధికి అంకురార్పణ జరిగిందని వెల్లడించారు. దేశ రాజధానిలో ఇప్పటినుంచి జరిగే మార్పులను చూసి పౌరులందరూ గర్వపడతారని చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో బీజేపీ పాలన ప్రారంభం కావడంతో తాము చాలా సంతోషంగా ఉన్నామన్నారు.

చంద్రబాబు, పవన్‌కు మాత్రమే ఆ గౌరవం

ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం వైరలవుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతోపాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, పలు రాష్ట్రాల సీఎంలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారిలో ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వని మోదీ... బాబు, పవన్‌కు మాత్రం ఇవ్వడం వైరలవుతోంది. ఎన్డీయేలో కీలకంగా ఉన్నందునే మోదీ వారికి అంత ప్రాధాన్యత ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కేంద్ర మంత్రితో చంద్రబాబు, పవన్ భేటీ

ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో వారిద్దరు భేటీ అయ్యారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో పోలవరానికి రూ.12 వేల కోట్లు కేటాయించగా.. నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో చర్చించారు. పోలవరం కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తా: రేఖా గుప్తా

ఢిల్లీ సీఎంగా తనను ఎంపిక చేయడంపై రేఖా గుప్తా హర్షం వ్యక్తం చేశారు. తనను నమ్మి ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు అప్పగించినందుకు బీజేపీ అగ్రనేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పెద్దలు తనపై ఉంచిన నమ్మకం తనకు కొత్త శక్తిని, ప్రేరణను ఇచ్చిందన్నారు. ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సమగ్ర అభివృద్ధి కోసం నిజాయితీ పని చేస్తానని చెప్పుకొచ్చారు. ఢిల్లీని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తానన్నారు.

Tags:    

Similar News