TDP: టీడీపీకి కార్యకర్తలే బలం: చంద్రబాబు
పార్టీ లేదన్న వారే కాలగర్భంలో కలిసిపోయారు... టీడీపీకి మీరందరూ వారసులే;
టీడీపీ జెండాకు ఒక అర్థం ఉందని... అన్నదాతలకు అండగా ఉండాలని నాగలి, కార్మికులకు, పారిశ్రామిక ప్రగతికి చిహ్నంగా చక్రం, నిరుపేదలకు నీడను అందించాలని గుడిసె చిహ్నాలు సూచిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇదే మన నాయకుడు నందమూరి తారక రామారావు విజన్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు... ప్రత్యేక సందేశం వెలువరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన వేడుకలకు చంద్రబాబు హాజరయ్యారు. చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర హోంమంత్రి అనిత, ఇతర నేతలు పార్టీ జెండాను ఎగురవేసి, ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
ఒక మహనీయుడు ప్రతిరూపమే...
ఒక మహనీయుడి విజన్ కు ప్రతిరూపమే తెలుగుదేశం పార్టీ అని అభివర్ణించారు. ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ... పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. అనేక విప్లవాత్మక పథకాలతో పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అటువంటి చారిత్రాత్మక పార్టీకి మనందరం వారసులం... నేను టీమ్ లీడర్ ను మాత్రమే అని చంద్రబాబు స్పష్టం చేశారు. '43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. నందమూరి తారకరామారావు ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించిన టీడీపీ దేదీప్యమానంగా వెలుగుతుందంటే దానికి కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం. పార్టీ సాధించిన ప్రతి విజయం వెనుక కార్యకర్తల కష్టం ఉంది.' అంటూ పేర్కొన్నారు.
టీడీపీ ఆవిర్భావం తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిరునామా
టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లిలో ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ జిల్లా నాయకులు జనార్దన్ రావు పూలమాల వేసి, పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తెలుగు జాతి ఆత్మగౌరవానికి, అభివృద్ధికి చిరునామాగా మారిందని అన్నారు.
పేదల కోసమే టీడీపీ ఆవిర్భావం: మంత్రి స్వామి
టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. కొండేపి ఎమ్మెల్యే, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, మారిటైం బోర్డ్ ఛైర్మన్ దామచర్ల సత్య కలిసి టీడీపీ జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం టీడీపీ ఆవిర్భవించిందని చెప్పారు. టీడీపీతో ఎన్టీఆర్ సమాజంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారని కొనియాడారు.
'టీడీపీ లేకుండా తెలుగు రాజకీయాలు లేవు'
పి. గన్నవరంలోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ నామన రాంబాబు పాల్గొని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీని లేకుండా చేద్దామని చూసిన వారంత కాలగర్భంలో కలసి పోయారన్నారు. టీడీపీ లేకుండా తెలుగు రాజకీయాలు లేవన్నారు. అనంతరం జెండా ఎగురవేసి కేక్ కట్ చేశారు.