CBN: వైసీపీ ప్రభుత్వం మిగిల్చింది చెత్త కుప్పలే

కూటమి పార్టీలు సమన్వయంతో సాగాల్సిందే... ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసల వర్షం;

Update: 2024-10-19 02:00 GMT

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన కీలక భేటీలో ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. హరియాణా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత చండీగఢ్‌లో ఎన్డీయే ముఖ్యమంత్రులతో సమావేశం జరిగిందని.. ఆ భేటీకి తాను హాజరయ్యానని చంద్రబాబు తెలిపారు. ఐదు గంటల పాటు ప్రధాని మోదీ ఆ భేటీలో కూర్చున్నారని... రాబోయే ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నారని అన్నారు. పట్టుదల, కృషి వల్లే మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టగలిగారని... ప్రజల విశ్వాసాన్ని పొందడం, ఏ నిర్ణయం తీసుకొన్నా వారిని దృష్టిలో పెట్టుకోవడం వల్లనే ఆయన అసాధారణ విజయాలను సాధిస్తున్నారని అన్నారు. దాని వెనక కఠోరశ్రమ, క్రమశిక్షణ ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ తప్పు చేయకుండా ఉండడమే కాకుండా.. పార్టీనీ చేయనివ్వకుండా కాపాడుతున్నారని అన్నారు. కాబట్టే నిలబడుతున్నారని చంద్రబాబు వెల్లడించారు. ఏకపక్షంగా వెళతామంటే కుదరదని... మూడు పార్టీలు సమష్టిగా పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.


జగన్‌పై ఆగ్రహం ..

గత ఐదేళ్లలో కేంద్రం ఇచ్చిన నిధుల్ని జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీలకు ఇవ్వాల్సిన రూ. 990 కోట్లు పక్కదారి పట్టించారని... దీంతో రూ. 1,200 కోట్లు రాకుండా పోయాయన్నారు. ఇవన్నీ ప్రజలు గమనించే తమకు భారీ మెజార్టీ ఇచ్చారన్నారు. జగన్‌ రాష్ట్రాన్ని రూ.పది లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని, వాటికి ఏటా రూ. 90 వేల కోట్లు వడ్డీలే కట్టాల్సి వస్తోందని చంద్రబాబు వివరించారు. ఏపీలో ఎక్కడికి వెళ్లినా వేల మెట్రిక్‌ టన్నుల చెత్త పేరుకుపోయిందని.. జగన్‌ మిగిల్చింది ఇదేనని ఎద్దేవా చేశారు. గంజాయిని విచ్చలవిడి చేశారని, ఇటీవల హిందూపురంలో జరిగిన అత్యాచార ఘటన వెనక కూడా గంజాయే ఉందని తెలిపారు. వైసీపీ వాళ్లు చేయని తప్పులు లేవని.. వాళ్లలా మనమూ కక్ష సాధింపులకు దిగితే ఏపీ రావణకాష్ఠంలా మారుతుందని పేర్కొన్నారు. అలాగని తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

మనపై వరుణ దేవుడి అనుగ్రహం

వరుణదేవుడి అనుగ్రహం మన మీద ఉందని చంద్రబాబు అన్నారు. 95 శాతం చెరువులు, ప్రాజెక్టులు నీళ్లతో కళకళలాడుతున్నాయని... ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ప్రాధాన్య క్రమంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. జనాభా దామాషా ప్రకారం పదవులిస్తామని చంద్రబాబు వెల్లడించారు. మనం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. భూ సమస్యల పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందిస్తామన్నారు.

Tags:    

Similar News