AP: గోపాలకృష్ణ ద్వివేది బదిలీ
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...వారం రోజులు కూడా తిరక్కుండానే ద్వివేది బదిలీ;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని సర్కార్ బదిలీ చేసింది. గతవారం జరిగిన బదిలీల్లో.. కొంత మంది సీనియర్ ఐఏఎ్‌సలకు కీలక పోస్టింగ్ ఇచ్చింది. అప్పుడు పోస్టింగ్ పొందిన వారిలో ద్వివేది కూడా ఉన్నారు. జగన్ సర్కారుతో అత్యంత సన్నిహితంగా మెలగిన ఆయన్ను జీఏడీకి పంపిస్తారని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం ఆయన్ను కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అనంతరం ప్రభు త్వం పునరాలోచనలో పడింది. సోమవారం రాత్రి ఆయన్ను కార్మిక శాఖనుంచి రిలీవ్ చేయడంతో పాటు జీఏడీకి అటాచ్ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఎన్నికల సమయం నుంచి ఆయన వైసీపీకి సన్నిహితంగా ఉం టున్నారనే విమర్శలున్నాయి. ఆ ఎన్నికల్లో ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో)గా ఉన్న ఆయన వైసీపీ విజయానికి సహకరించారని టీడీపీ ఆరోపించింది. నాటి సీఎం చంద్రబాబు కూడా ద్వివే ది కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైసీపీ గద్దెనెక్కాక జగన్ ఆయనకు కీలకమైన పోస్టింగ్స్ ఇచ్చింది. గ్రామ సచివాలయాలకు, వాటర్ ట్యాంక్‌లకు వైసీపీ రంగులు వేయడం పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన నేతృత్వంలోనే జరిగింది. హైకోర్టు ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన మాత్రం రంగులను వదిలిపెట్టలేదు. ఇలా ప్రభుత్వం చెప్పిన పనులన్నీ చేస్తూ కీలకమైన పోస్టుల్లో కొనసాగారు. ప్రభుత్వం మారిన తర్వాత కార్మిక శాఖకు వెళ్లినా, ప్రభుత్వం అక్కడ నుంచి బదిలీ చేసింది. ఆయన స్థానంలో పశు సంవర్థక శాఖ సెక్రటరీగా ఉన్న ఎం.ఎం.నాయక్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.
వారం రోజులు కూడా తిరక్కుండానే ద్వివేదిని అక్కడి నుంచి బదిలీ చేసి సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయమని ఆదేశించింది. 2019 ఎన్నికలనాటికి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్న ద్వివేది.. అప్పటి అధికార పక్షమైన టీడీపీని ముప్పుతిప్పలు పెట్టి, వైకాపాకు అడ్డగోలుగా మేలు చేసేలా వ్యవహరించారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. దానికి తగ్గట్టే వైసీపీ అధికారంలోకి వచ్చాక పోస్టింగుల్లో ఆయనకు అసాధారణ ప్రాధాన్యం దక్కింది. మొదట ఆయనను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించిన ప్రభుత్వం.. 2020 మార్చి నుంచి గనులశాఖను పూర్తి అదనపు బాధ్యతగా ఆయనకే అప్పగించింది. రెండేళ్ల క్రితం ఆయనను వ్యవసాయం, పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసిన ప్రభుత్వం, గనుల శాఖను మాత్రం ఆయన వద్దే ఉంచింది. గత ఐదేళ్లలో ఆయన వైకాపా పెద్దలపై కృతజ్ఞత చాటుకోవడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోలేదన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలోని పంచాయతీ భవనాలు, వాటర్ ట్యాంకులకు వైసీపీ జెండా రంగులను పోలిన రంగులు వేయించడం, గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, ఆరోగ్యకేంద్రాల భవనాలకు రూ.10 వేల చొప్పున ప్రజాధనాన్ని వెచ్చించి నవరత్నాల లోగోలు వేయించడం వంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. రంగులపై కోర్టు అక్షింతలు వేయడంతో వాటిని తొలగించారు. రంగులు వేయడానికి, తీయడానికి రూ.వందల కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేశారు.