AP liquor : ఏపీ లిక్కర్ కేసు.. రెండో రోజు ఎంపీ మిథున్ రెడ్డిని విచారిస్తున్న సిట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ రెండో రోజు కస్టడీలోకి తీసుకుంది. ఈ ఉదయం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ఆయనను విజయవాడకు తరలించారు. విచారణ అనంతరం సాయంత్రం కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు పంపించనున్నారు.
తొలిరోజు విచారణలో ప్రశ్నల వర్షం రెండు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించిన నేపథ్యంలో సిట్ అధికారులు తొలిరోజు మిథున్ రెడ్డిని సుమారు నాలుగు గంటల పాటు విచారించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. సిట్ అధికారులు మిథున్ రెడ్డిని 50కి పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అయితే ఆయన ఏ ఒక్కదానికీ సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది.
రూ. 5 కోట్ల ముడుపులపై ప్రధానంగా విచారణ మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాల్లోకి మద్యం ముడుపుల నుంచి రూ. 5 కోట్లు జమకావడంపై సిట్ అధికారులు ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ నిధుల మూలం, లావాదేవీల గురించి ఆయన నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేటి విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.