బాబాయ్‌ వివేకాను చంపింది ఎవరో జగన్‌ ఎందుకు చెప్పడం లేదు : చంద్రబాబు

అధికారపార్టీని చూసి... ఎవరూ భయపడొద్దని.. తాము తిరగబడితే ఎవరూ ఆపలేరని హెచ్చరించారు.

Update: 2021-02-27 03:01 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు జోరుగా సాగింది. రాజ్‌పేట బహిరంగసభలో ప్రసంగించిన చంద్రబాబు... రాష్ట్రాన్ని స్వాహా చేయాలని జగన్‌ కంకణం కట్టుకున్నారని విమర్శించారు. బాబాయ్‌ వివేకాను చంపింది ఎవరో జగన్‌ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఏపీలో రౌడీరాజ్యం, అరాచకపాలన సాగుతోందని ధ్వజమెత్తారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదాను ఎందుకు సాధించలేదని నిలదీశారు. జగన్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ ఉక్కు కూడా పోయిందని, సీఎంకు సెంటిమెంట్‌ అంటే ఏంటో తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కడపల్లి పంచాయతీ పోడూరులో పర్యటించిన చంద్రబాబు.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త క్రిష్ణప్ప కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పార్టీ తరపున 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అనంతరం... రామకుప్పం సభలో ప్రసంగించిన చంద్రబాబు... ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఎప్పుడైనా నిలిచి గెలిచావా సజ్జల అని ప్రశ్నించారు. తనను విమర్శించే ముందు అర్హత ఏంటో తెలుసుకోవాలని హెచ్చరించారు.

రామకుప్పంలో పర్యటన తర్వాత... శాంతిపురం బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీకి బలమున్న ప్రాంతాల్లో ఏమీ చేయలేక.... వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలకు దిగి... పంచాయతీ ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. ఓట్ల లెక్కింపు సమయంలో కరెంట్‌ కట్‌ చేశారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులు అధైర్యపడొద్దని... అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అధికారపార్టీని చూసి... ఎవరూ భయపడొద్దని.. తాము తిరగబడితే ఎవరూ ఆపలేరని హెచ్చరించారు.

చంద్రబాబు కుప్పం పర్యటనతో కార్యకర్తలు, టీడీపీ అభిమానుల్లో జోష్‌ పెరిగింది. చంద్రబాబు ఆదేశాలతో వైసీపీ దాడులను ఎదుర్కొంటామని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయం కుప్పం మున్సిపాలిటీ కార్యకర్తలతో చంద్రబాబు చర్చించనున్నారు. మధ్యాహ్నం బెంగళూరుకు వెళ్లి.... అక్కడి నుంచి సాయంత్రం విజయవాడ ప్రయాణం కానున్నారు.


Tags:    

Similar News