ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ( N. Chandrababu Naidu ) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ( Revanth Reddy ) లేఖ రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాక ఏర్పడ్డ విభజన సమస్యలను పరిష్కరించుకోవడం కోసం లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనం కోసం విభజన సమస్యల పరిష్కారం దిశగా సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. తద్వారా విభజన సమస్యలపై చర్చించుకుందామని.. పొరుగు రాష్ట్రాలుగా పరస్పర సహకారాలు అందించుకుందామని చంద్రబాబు తెలిపారు.
"తనదైన ముద్ర వేస్తూ పరిపాలన సాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. మీ చిత్తశుద్ధి, నాయకత్వ పటిమ తెలంగాణ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న మనం రెండు రాష్ట్రాల సమగ్ర, సుస్థిర అభివృద్ధి కోసం పరస్పరం సహకారం అందించుకోవాలి. ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు గడిచాయి. పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉండగా అవన్నీ ఇంకా పెండింగ్లోనే ఉండిపోయాయి. వాటి కారణంగా మన రెండు రాష్ట్రాల్లో సంక్షేమం, ఇతర అంశాలకు అడ్డంకిగా మారుతోంది. వీటన్నింటిని మనం కూర్చొని పరి ష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం జూలై 6న శనివారం మధ్యా హ్నం మీ ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసుకొందామని నేను ప్రతిపాదిస్తున్నాను. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కీలకమైన సమస్యలు ఇలా ముఖాముఖి సమావేశంలో కూర్చొని చర్చించుకుంటేనే పరిష్కారం అవుతాయి. ఇరు రాష్ట్రాలకు లబ్ధికలిగే విధంగా పరస్పరం సహకరించుకోవాలి. మన భేటీ సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నాను" అని చంద్రబాబు రాసిన లేఖలో తెలిపారు.
చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇరు రాష్ట్రాల మధ్య చిక్కుముడిగా మిగిలిన విభజన సమస్యలు పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ మంగళవారం ఆయన తిరుగు లేఖ పంపుతానని సోమవారం రాత్రే చెప్పారు. ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు ప్రజాభవన్ వేదికగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది.