YCP: జగన్‌ సిద్ధం సభలతో ప్రజలకు తప్పని తిప్పలు

జగన్‌ పర్యటనలతో సామాన్య ప్రజలకు అవస్థలు... పల్నాడు జిల్లాలో సిద్ధం సభలకు బస్సుల తరలింపు

Update: 2024-04-11 02:00 GMT

ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనలతో సామాన్య ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. పల్నాడు జిల్లాలో సిద్ధం సభలకు బస్సుల తరలింపుతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. దీనికి తోడు ట్రాఫిక్‌ ఆంక్షలతో నరకం చూశారు. అన్నొస్తే అవస్థలే అని నిట్టూరుస్తూ ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. పల్నాడు జిల్లాలో సీఎం జగన్ పర్యటన సామాన్యులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. పిడుగురాళ్లలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు ఆర్టీసీ అధికారులు జిల్లా నుంచి 200 బస్సులు కేటాయించారు. ఫలితంగా బస్సుల కోసం ప్రయాణీకులు, విద్యార్థులు బస్టాండ్ లలో పడిగాపులు కాశారు. మహిళలు, వృద్ధుల పరిస్థితి మరీ దారుణం. మండుటెండలో బస్సుల కోసం నిరీక్షించి నీరసించారు. అధికారుల తీరుతో సమయానికి గమ్యస్థానం చేరుకోలేకపోయామని కొందరు ప్రయాణీకులు అసహనం వ్యక్తం చేశారు. నరసరావుపేట బస్టాండ్‌లో వచ్చిన ఒకటీ రెండు బస్సుల కోసం జనం ఎగబడ్డారు..


శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చిన కర్నాటక భక్తులకు సైతం ఇబ్బందులు తప్పలేదు. ఉగాది పండుగ సందర్భంగా... కర్నాటక, ఇతర ప్రాంతాల శ్రీశైలం వచ్చిన భక్తులు... దర్శనానంతరం తిరిగి వెళ్లేందుకు బస్సులు లేక అవస్థలు పడ్డారు. మార్కాపురం నుంచి సిద్ధం సభకు 45 బస్సులు తరలించటంతో.... శ్రీశైలం నుంచి తిరిగివెళ్లేందుకు బస్సుల్లేక పడిగాపులు కాశారు. బస్సుల కోసం చాలాసేపు ఎదురుచూసిన భక్తులు.. గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఘాట్ రోడ్డులో ఆటోలు, జీపులను ఆశ్రయించారు. కొంత మంది కన్నడ భక్తులు మండుటెండలో ప్రైవేటు వాహనాల్లో ప్రమాదకర రీతిలో ఇళ్లకు వెళ్లిపోయారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి కారణం వైకాపా ప్రభుత్వమే అని సీఎం జగన్ అన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జరిగిన... 'మేమంతా సిద్ధం' సభలో పాల్గొన్న జగన్ 2014లో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం సూపర్ సిక్స్ పేరుతో జనాలను మళ్లీ మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో... ఏపీలోని అన్ని అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లోనూ వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను జగన్ కోరారు.

Tags:    

Similar News