జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ( Pawan Kalyan ) డిప్యూటీ సీఎం చేస్తారని తెలుస్తోంది. అలాగే కీలకమైన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం. పవన్ కోరిక మేరకే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారట. అలాగే నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేశ్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖలను అప్పగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ చంద్రబాబు మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా.. ఆశిస్తున్నా’ అంటూ చిరంజీవి Xలో పోస్ట్ పెట్టారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.
ఇక 2019లో ఒకే ఒక జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. కొన్నాళ్లకు ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. దీంతో జనసేన బలం శూన్యమైనట్లయింది. ఇక మునిగే పడవలాంటి ఆ పార్టీలో ఎవరూ ఉండరని, అంతకుముందు ఏడాదే పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్ కూడా పార్టీకి దూరమవుతారనే భావన చాలామందిలో కలిగింది. ఆయన మాత్రం అలా చేయలేదు. రాముడికి హనుమంతుడిలా పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు. నిజాయితీని నిరూపించుకున్నారు. ఈరోజు తెనాలి ఎమ్మెల్యేగా మంత్రి పదవి అందుకున్నారు.