AP: ఏపీలో హోరెత్తుతోన్న కూటమి ప్రచారం

కూటమి మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి ఆదరణ.... కూటమి అభ్యర్థులకు స్థానికులు ఘన స్వాగతం

Update: 2024-05-05 01:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. తెలుగుదేశం సూపర్‌ సిక్స్‌, కూటమి మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు స్థానికులు ఘన స్వాగతం పలుకుతున్నారు. బాణాసంచా కాలుస్తూ, నృత్యాలు చేస్తూ, పూల వర్షం కురిపిస్తూ... బ్రహ్మరథం పడుతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డికి ఎన్నికల ప్రచారంలో నిరసనసెగ ఎదురైంది.


తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి విజయశ్రీ... నాయుడుపేటలో ప్రచారం నిర్వహించారు. విజయశ్రీని ఆప్యాయంగా పలకరించిన స్థానిక మహిళలు సమస్యలు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆమె భరోసానిచ్చారు. తెలుగుదేశం సూపర్‌ సిక్స్‌ పథకాలను మహిళలకు వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలోని తండాల్లో కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వెంకటప్రసాద్‌ వెంట తిరుగుతూ ఓటర్లను పరిచయం చేశారు. కందికుంట వెంకటప్రసాద్‌కు మద్దతుగా ఆయన సతీమణి యశోదా దేవి కూటమి శ్రేణులతో కలిసి కదిరిలో ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి వెంకటప్రసాద్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. Y.S.R. జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలంలో కూటమి అభ్యర్థి ఆదినారాయణరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా భూపేష్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

నెల్లూరు జిల్లా కోవూరు కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇందుకూరుపేట మండలంలో ప్రచారం చేశారు. ఆమెకు మహిళలు ఘన స్వాగతం పలికారు. ఐదేళ్ల వైసీపీ పాలన అవినీతి, అక్రమాలమయమని ప్రశాంతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. M.L.A. ప్రసన్నకుమార్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా డోన్‌లో తెలుగుదేశం జెండా ఎగురుతుందని కూటమి అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. ఎర్రగుంట్ల, పెద్ద మల్కాపురం గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన ఆయన తాగునీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను మహిళలకు వివరించారు.

పాణ్యం నియోజకవర్గ కూటమి అభ్యర్థి గౌరు చరిత ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓర్వకల్లు మండలంలోని గ్రామాల్లో పర్యటించారు. మహిళలు పెద్ద సంఖ్యోల ప్రచారంలో పాల్గొని గౌరు చరితకు మద్దతు ఇచ్చారు. గ్రామాల్లో నిర్వహించిన రోడ్‌షోకు స్థానికుల బ్రహ్మరథం పట్టారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి అభ్యర్థి పార్థసారథి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రోడ్‌షో ఏర్పాటు చేసి వైకాపా M.L.A. సాయి ప్రసాద్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. ఎమ్మిగనూరులోని 33వార్డులో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. మహిళలకు తెలుగుదేశం సూపర్‌ సిక్స్ పథకాలు వివరించారు. కూటమి అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయలు పింఛన్‌ ఇస్తామని చెప్పారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ వైకాపాలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. 

Tags:    

Similar News