మంగళగిరి నియోజకవర్గంలో అక్కడక్కడ ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం అయింది. మంగళగిరిలోని కొప్పురావుకాలనీ, సీకే హైస్కూల్లో ఈవీఎంలు మొరాయించాయి. దుగ్గిరాల మండలం చుక్కావారి పాలెం, మోరంపూడిలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఇక హిందూపురంలో పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు టీడీపీ అభ్యర్థి, సినీనటుడు బాలకృష్ణ దంపతులు. ఆర్టీసీ కాలనీ 42వ పోలింగ్ బూత్‌లో ఓటు వేయనున్నారు బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం దలవాయిలో పోలింగ్ నిలిచిపోయింది. పోలింగ్ కేంద్రంలో జనసేన ఏజెంట్ రాజారెడ్డిని వైసీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో ఈవీఎంలు ధ్వంసం కాగా పోలింగ్ నిలిచిపోయింది. ఈ ఘటనపై జనసేన నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాలను వెల్లడించారు ఎన్నికల అధికారులు. ఏపీలో 9.51 శాతం, తెలంగాణలో 9.48 శాతం పోలింగ్ నమోదు అయింది.