పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనుంది. ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై వాస్తవాలను ప్రభుత్వం వివరించనుంది. మధ్యాహ్నం 3గంటలకు అమరావతి సచివాలయంలో దీనిని విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం రేపు పోలవరం పరిశీలనకు రానుంది. నిర్మాణాలను పరిశీలించి ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఓ నివేదిక ఇవ్వనుంది. దీని ప్రకారం ప్రభుత్వం పనులు చేపట్టనుంది.
సీఎంగా ప్రమాణ స్వీకారం తరువాత చంద్రబాబు తొలి క్షేత్రస్థాయి పర్యటనకు పోలవరం వెళ్లారు. అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసంపై వివరాలను శ్వేతపత్రం ద్వారా వెల్లడించనున్నారు. ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేయనున్నారు.
జగన్ విధానాల వల్ల జరిగిన నష్టం, ముందున్న సవాళ్లపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం రూపొందించారు. మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖలపై నేటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు నిర్వహించనున్నారు. అమరావతి సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై శుక్రవారం తొలి సమీక్ష చేయనున్నారు. శాఖలో వెంటనే చేపట్టాల్సిన చర్యలు, దీర్ఘకాల ప్రణాళికపై మంత్రి సత్యకుమార్ యాదవ్, అధికారులతో చర్చించనున్నారు.