AP: జగన్‌ పర్యటనతో తప్పని తిప్పలు

గుంటూరులో జగన్‌ సభలో అధికారుల అత్యుత్సాహం..... ఆంక్షలతో ప్రజలకు చుక్కలు చూపించిన పోలీసులు

Update: 2024-02-16 01:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌ ఎక్కడ పర్యటించినా ఆ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. గుంటూరు జిల్లాలో నిర్వహించిన వాలంటీర్లకు వదనం సభకు సీఎం జగన్‌ రాకతో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆర్టీసీ బస్సుల తరలింపు, ట్రాఫిక్‌ ఆంక్షలతో జనానికి చుక్కలు చూపించారు. ట్రాఫిక్‌ జామ్‌లో అంబులెన్స్‌ చిక్కుకున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో 'వాలంటీర్లకు వందనం' సభ ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టింది. సీఎం రాక సందర్భంగా అధికారులు పెట్టిన ఆంక్షలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. సీఎం సభకు వెళ్లే దారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటుచేశారు. దీనివల్ల చిన్నచిన్న సీసీ రోడ్ల మీదినుంచి ప్రధాన రహదారిపైకి రావడానికి వీల్లేక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సభ కోసం తెనాలి, వేమూరు నియోజకవర్గాల ఆర్టీసీ, స్కూలు బస్సులు, ప్రైవేటు వాహనాల్లో భారీగా జనాల్ని తరలించారు.


తెనాలి మండలం అంగలకుదురు, సంగం జాగర్లమూడి మధ్యలో వారికి భోజనాలు ఏర్పాటుచేయడంతో వాహనాలు రోడ్డుపైనే నిలిపివేశారు. ఆ మార్గంలో ఇతర వాహనాలన్నీ ఆగిపోయి 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్‌ ఇరుక్కపోయినా పోలీసులు పట్టించుకోలేదు. సీఎం జగన్ తాడేపల్లి నుంచి ఫిరంగిపురం హెలిప్యాడ్‌కు చేరుకోకముందే పోలీసులు ఆంక్షలు విధించారు. ఊరి బయటే బారికేడ్లు పెట్టి ప్రజలెవరినీ అనుమతించలేదు. పోలీసుల తీరుతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఫిరంగిపురంలోకి వెళ్లేందుకు స్థానికులకు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో మండుటెండలోనే నడిరోడ్డుపై నిలబడ్డారు.


ఇంటికి వెళ్లనివ్వమంటూ మహిళలు వేడుకున్నా.... సీఎం వెళ్లేదాకా రాకపోకలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డగించారు. దాదాపు అరగంట వరకు ఫిరంగిపురం బయటే ప్రయాణికులు అల్లాడిపోయారు. గాల్లో వెళ్లే సీఎం కోసం రోడ్లపై వెళ్లే వారిని ఆపడమేంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం సభ కోసం భారీగా ఆర్టీసీ బస్సులు తరలించారు. బాపట్లలో బస్సులు లేక ప్రజలు ఎండలోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఒకపక్క మండుటెండలో తాము అల్లాడిపోతుంటే.... మరోపక్క బస్సులకు వైకాపా జెండాలు కట్టి సభకు జనాన్ని తరలిస్తున్నారని ప్రయాణీకులు మండిపడ్డారు. ఫిరంగిపురం మీదుగా నరసరావుపేట వెళ్లే బస్సులను సత్తెనపల్లి, చిలకలూరిపేట మీదుగా మళ్లించటంతో... సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. పేరేచర్ల నుంచి నరసరావుపేట వైపు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేయటంతో... ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పలేదు. సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమం కోసం ఉదయం 6 గంటల నుంచే బస్సులు దారి మళ్లించడంపై ప్రయాణికులు మండిపడ్డారు. 

Tags:    

Similar News