Prakasam Barrage : భారీ వర్షాలు.. గోదావరి.. కృష్ణమ్మ ఉగ్రరూపం

Update: 2025-08-19 07:00 GMT

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం పెరిగింది. ప్రధాన ప్రాజెక్టులైన ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం, ధవళేశ్వరం, శ్రీరాంసాగర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్యారేజీకి ప్రస్తుతం 3.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మధ్యాహ్నానికి ఇన్‌ఫ్లో 5 లక్షల క్యూసెక్కులకు, సాయంత్రానికి 6 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నంలోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించింది.

శ్రీశైలం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద

జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3,38,218 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 4,00,158 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.70 అడుగుల నీటి మట్టం ఉంది. 10 స్పిల్‌వే గేట్ల ద్వారా భారీగా నీటిని విడుదల చేస్తున్నారు.

ఉగ్రరూపం దాల్చిన గోదావరి

గోదావరి నది కూడా ఉగ్రరూపం దాల్చింది. రాజమహేంద్రవరం వద్ద ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.5 అడుగుల నీటి మట్టం నమోదైంది. డెల్టా కాల్వలకు 2,100 క్యూసెక్కులు, సముద్రంలోకి 8.23 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 37.3 అడుగులకు చేరింది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1.45 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 2 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 73.37 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రధాన గేట్ల ద్వారా 1.73 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Tags:    

Similar News