BABU: ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్
తన పాత్రపై ప్రాథమిక ఆధారాలు లేవని వెల్లడి... ఎఫ్‌ఐఆర్‌లో తన పేరే లేదన్న తెలుగుదేశం అధినేత;
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పాత్రపై ప్రాథమిక ఆధారాలు లేకపోయినా సీఐడీ కేసు నమోదు చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై నేడు ఏసీబీ న్యాయస్థానం విచారణ జరపనుంది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ACB కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. APSSDCఛైర్మన్ ఇచ్చిన ఫిర్యాదులో తన పేరు ప్రస్తావనే లేదని పిటిషన్‌లో తెలిపారు. కేసు నమోదుకు కారణమైన రిపోర్టులో తనపై ఆరోపణలే లేవన్నారు. ప్రస్తుత కేసులో తన పేరు ఎప్పుడు చేర్చారో కనీస వివరాలు వెల్లడించలేదని FIRలో పేరు చేర్చిన విషయాన్ని అనిశా కోర్టుకు ఎప్పుడు సమాచారం ఇచ్చారో కూడా దర్యాప్తు సంస్థ వెల్లడించలేదన్నారు. ఏ ఆధారాలతో ఈ కేసులో నిందితుడిగా చేర్చారో చెప్పేందుకు సీఐడీ వద్ద ప్రాథమిక వివరాలు లేవన్నారు. రాజకీయ ప్రతీకారంతో ఈ కేసులోకి లాగారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత తనపై ఆరోపణలను తెరపైకి తెచ్చారని రిమాండ్ రిపోర్ట్ పరిశీలిస్తే వాంగ్మూలాలన్నీ 2022కి ముందు సేకరించినవేనని పిటిషన్‌లో తెలిపారు. 2022 నుంచి ఆ వివరాలన్ని C.I.D.వద్ద ఉన్నాయన్నారు. అదనపు సాక్ష్యాధారాలు లేకుండా దురుద్దేశంతో రాత్రికిరాత్రి అరెస్ట్ చేశారని చంద్రబాబు బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును 2021 డిసెంబర్ నుంచి దర్యాప్తు సంస్థ విచారణ చేస్తోందని సుమారు 141 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసిందన్నారు. రిమాండ్ రిపోర్టు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలిస్తే నైపుణ్యాభివృద్ధి సంస్థ వ్యవహారంలో వారిని సంప్రదించి తాను ప్రభావితం చేశానని ఒక్కరు చెప్పలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
తనపై చేసిన ఆరోపణలను నిరూపించేందుకు ప్రాథమిక సాక్ష్యాధారాలను సైతం దర్యాప్తు సంస్థ సేకరించలేకపోయిందని తెలిపారు. రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలన్న దురుద్దేశంతో సీఎం ప్రోద్భలంతో ఈ కేసులోకి లాగారని పిటిషన్‌లో వివరించారు. అనినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ ఆమోదం లేకుండా తన పేరును FIRలో చేర్చడం, దర్యాప్తు చేయడం, అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని... బెయిలు మంజూరు చేయడానికి ఈ ఒక్క కారణం సరిపోతుందని పిటిషన్‌లో తెలిపారు.
తప్పుడు కేసులో ఇరికించినప్పటికీ దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేస్తాననేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నానని సీఐడీ చేస్తున్న ఆరోపణల కారణంగా బెయిలు నిరాకరించడానికి వీల్లేదన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని రెగ్యులర్ బెయిలు మంజూరు చేయాలని.. ప్రధాన బెయిలు పిటిషన్ తేల్చే వరకు మధ్యంతర బెయిలు ఇవ్వాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు.