మెగా డీఎస్సీ అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 19 న జరగాల్సిన డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వారు తెలిపారు. కాగా ఎంపికైన అభ్యర్థులకు ఈ సమాచారాన్ని ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు.
ఈ నెల 19న అమరావతిలోని సచివాలయం సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయాలని ముందుగా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అధికారులు. వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులను అమరావతికి తరలించడానికి బస్సులు కూడా సిద్ధం చేశారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృశ్య ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా సభను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.