Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరి
రూ. 11.500 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం... అనుకున్నది సాధించిన చంద్రబాబు;
విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఊపిరులూదబోతోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉండదని కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. నిర్వహణ నిధుల కోసం ఇబ్బంది పడుతున్న స్టీల్ ప్లాంట్ కు కేంద్రం రూ. 11.500వేల కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని గతంలో నిర్ణయించింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో కేంద్రంలో టీడీపీ కీలకంగా మారడం... ఆ పార్టీ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని హామీ ఇవ్వడంతో కేంద్రం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆపరేషనల్ ఖర్చుల కోసం ప్యాకేజీ ప్రకటించి తర్వాత.. ఆ సంస్థను పూర్తి స్థాయిలో గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలను తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పునరుజ్జీవింపజేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం రూ.11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీ సమకూర్చడానికి నిర్ణయించినట్లు తెలిసింది.
అనుకున్నది సాధించిన చంద్రబాబు
కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సీఎం చంద్రబాబు అనుకున్నది సాధించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాన అస్త్రంగా మారిన విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులు కేటాయించాలని చంద్రబాబు చేసిన రిక్వెస్ట్‌కు కేంద్రం సానుకూలంగా స్పందించింది. తాజాగా స్టీల్ ప్లాంట్‌కు రూ.11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర క్యాబినెట్ ప్రకటించింది. దీంతో చంద్రబాబు తన మార్క్ చూపించారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ
స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయకుండా పలు ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్రం పరిశీలిస్తోంది. సెయిల్ లో విలీనం చేయాలన్న డిమాండ్ కొంత కాలంగా ఉంది. రుణాల నుంచి బయటపడేందుకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 1500 నుంచి 2000 ఎకరాల భూములను ఎన్‌ఎండీసీకి విక్రయించే ప్రతిపాదనలు, బ్యాంకు రుణాల వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తిని పెంచేందుకు నిధులు కేటాయించాలన్న డిమాండ్ కార్మిక వర్గాల నుంచి వస్తోంది. ముడిసరుకు కొరతతో స్టీల్ ప్లాంట్‌లోని రెండు ఫర్నేసులలో ఉత్పత్తి నిలిపేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల సెంటిమెంట్ లాంటిది. అయితే అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా వాటా లేదు. వంద శాతం రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ కు చెందినదే. అయితే ప్రభుత్వంలో .. ఎన్డీఏ ఉండటంతో టీడీపీ ఒత్తిడి కారణంగా ప్రైవేటీకరణ ఆపేయాలని కేంద్రంర నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.