హోరాహోరీ అనే పదానికి అసలైన అర్థంలా సాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభ రెండింటికీ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 5,460.. 25 లోక్‌సభ స్థానాలకు 965 నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థుల సంఖ్య 2019 ఎన్నికల గణాంకాలను అధిగమించింది. 2019లో 175 అసెంబ్లీ స్థానాలకు 4,299... 25 లోక్ సభ స్థానాలకు 770 నామినేషన్లు దాఖలయ్యాయి.
175 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 5,460 నామినేషన్లు దాఖలయ్యాయి. తిరుపతిలో అత్యధికంగా 83 నామినేషన్లు దాఖలయ్యాయి. వారిలో 34 మంది స్వతంత్రులు కాగా, మిగిలిన వారు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు. మంగళగిరిలో (76), నంద్యాల (64), చంద్రగిరి (63), ఒంగోలు, విజయవాడ పశ్చిమ (61) చొప్పున నామినేషన్లు వేశారు. కమలాపురం నియోజకవర్గంలో అత్యల్పంగా 9 నామినేషన్లు నమోదయ్యాయి. పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే.. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 965 నామినేషన్లు దాఖలయ్యాయి.
విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 69 నామినేషన్లు దాఖలయ్యాయి. వారిలో 17 మంది స్వతంత్ర అభ్యర్థులు కాగా, మిగిలిన వారు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు. గుంటూరులో 67, రాజంపేటలో 61, నంద్యాలలో 57 నామినేషన్లు వచ్చాయి. మచిలీపట్నం నియోజకవర్గంలో అత్యల్పంగా 21 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరులో 56, విజయవాడలో 50, కడపలో 47, ఒంగోలులో 45, తిరుపతిలో 44, కర్నూలులో 41, హిందూపురం, అంకపల్లె, నరసరావుపేటలో 40 చొప్పున నామినేషన్లు వేశారు. కాకినాడ, నరసాపురం 39, అరకు, అనంతపురం 38, నెల్లూరు 36, అమలాపురం 35, బాపట్ల 34, శ్రీకాకుళం 33, రాజమహేంద్రవరం, విజయనగరం 30, ఏలూరు 28 చొప్పున నామినేషన్లు దాఖలు చేసినట్లు ఈసీ అధికారులు తెలిపారు. ఇవాళ నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. ఏప్రిల్ 29లోపు ఉపసంహరించుకోవచ్చు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది.