AP : కక్ష సాధించొద్దు.. ప్రతీకారాలొద్దు.. పవన్ కీలక సూచనలు

Update: 2024-06-12 06:44 GMT

ఏపీలో ప్రజలు అతిపెద్ద బాధ్యతను కూటమిపై పెట్టారని అన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ). ఇది కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదు.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో సమష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది... అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. గతి తప్పిన రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం, అనుభవం చాలా అవసరమన్నారు. విజయవాడలో మంగళవారం జరిగిన టీడీపీ-జనసేన - బీజేపీ కూటమి శాసన సభా పక్ష సమావేశంలో చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఎన్డీయే తరఫున సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ఆయన ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమర్థించారు. ఈ సందర్భంగా పవన్ చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ చంద్రబాబు బాగా నలిగిపోవడం జైల్లో చూశానని, అప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పడిన బాధను కూడా చూశానని, మంచిరోజులు వస్తాయని, కన్నీళ్లు పెట్టొద్దని చెప్పానని వెల్లడించారు. ఆ రోజులు వచ్చాయనీ.. చంద్రబాబుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్నా అద్భుతమైన పాలన అందివ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ గత ఐదేళ్లలో కక్షపూరిత పాలనను ఎదుర్కొన్నామని, అభివృద్ధి అనే పదానికి అర్ధం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు యుక్తి, మోదీ స్ఫూర్తి, పవన్ శక్తి కలయికే కూటమి అని అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలనపై దృష్టి పెట్టాల్సి ఉందని తెలిపారు.

Tags:    

Similar News