TDP PROTEST: బాబుకు మద్దతుగా కొనసాగుతున్న పోరు

ఆందోళనతో కదం తొక్కుతున్న తెలుగు తమ్ముళ్లు... జగన్‌ పతనం తప్పదని మండిపాటు;

Update: 2023-09-15 03:45 GMT

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టుకి వ్యతిరేకంగా.. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ర్యాలీలు, దీక్షలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ నెల్లూరులో రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి రక్తంతో సంతకం చేశారు. 73 ఏళ్ల వయసులో చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్‌ చేసి ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదని ప్రభుత్వానికి హితవు పలికారు. బాబుకు తోడుగా చేపట్టిన రిలే దీక్షలో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఆత్మకూరు పురపాలక బస్టాండ్‌లో చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ ఎమ్మెల్యే ఆనం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు. చంద్రబాబు జైలులో ఉన్న ఫొటోలు, వీడియోలు చూస్తూ జగన్‌ పైశాచికం ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


చంద్రబాబుకు తోడుగా మేము సైతం అంటూ విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకు తానే సమాధి కట్టుకున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఇంటి వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబుకి మద్దతు తెలియజేస్తూ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తెదేపా శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేశారు. జగన్‌ ప్రభుత్వానికి కౌంట్‌ డౌన్‌ మొదలైందని టీడీపీ అధికారంలోకి రాగానే తగిన బుద్ధి చెబుతామని మాజీమంత్రి పీతల సుజాత హెచ్చరించారు. చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ తెదేపా అగ్నికుల క్షత్రియ విభాగం నరసాపురం వశిష్ట గోదావరిలో జలదీక్ష చేశారు.


చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ రాయలసీమ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరసనలు తెలిపారు. ధర్మవరం నియోజకవర్గం ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ రిలే నిరాహార దీక్ష చేశారు. జగన్‌ దుర్మార్గపాలన నుంచి ఏపీ ప్రజలను విముక్తి చేసేందుకు జనసేన, తెలుగుదేశం కలసి పనిచేస్తాయని అన్నారు.


జగన్‌ అధికార బలంతో చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించడాన్ని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఖండించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో నిర్వహించిన నిరాహార దీక్షలో బండారు పాల్గొన్నారు. చంద్రబాబుకి సంఘీభావంగా అనకాపల్లిలో టీడీపీ, జనసేన పార్టీ నేతలు కాగడాల ప్రదర్శన చేపట్టారు. జగన్ కి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. 

Tags:    

Similar News