TDP PROTESTS: నిరసనల హోరు

చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా కొనసాగుతున్న ఆందోళనలు

Update: 2023-10-07 03:30 GMT

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజలు వినూత్న రీతిలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ బాపట్ల జిల్లా అద్దంకిలో ఆ పార్టీ శ్రేణులు సంకెళ్లతో వినూత్నంగా నిరసన తెలిపాయి. న్యాయానికి, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు అంటూ నినదించారు. చంద్రబాబుకు సంఘీభావంగా అద్దంకి MLA గొట్టిపాటి రవికుమార్‌ సైకిల్‌ యాత్ర నిర్వహించారు. నాగులపాడు గ్రామం నుంచి మణికేశ్వరంలోని శివాలయం వరకు 8కిలో మీటర్ల మేర సైకిల్‌ యాత్ర చేశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రాయలసీమలో టీడీపీ నేతలు వినూత్న రీతిలో ఆందోళనలు చేశారు. అనంతపురం టవర్‌ క్లాక్‌ వద్ద క్రిస్టియన్ సెల్‌ ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. సైకో పోవాలి-సైకిల్‌ రావాలంటూ నినాదాలు చేశారు. అనంతపురంలో చేపట్టిన దీక్షలో పెద్దఎత్తున TNSF కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబును విడుదల చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని TNSFనేతలు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లిలో తెలుగుదేశం కార్యకర్తలు జలదీక్ష చేపట్టారు.


కర్నూలు జిల్లా మంత్రాలయంలో దీక్షా శిబిరానికి బసవన్నను తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. నంద్యాలలో దీక్షా శిబిరాన్ని యాదవ సంఘ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో అరగుండు, అరమీసంతో ధర్నా చేశారు. జగన్‌ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించి పైశాచిక ఆనందాన్ని పొందుతోందని నేతలు మండిపడ్డారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ... గూడూరులో పార్టీ శ్రేణులు ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గొరవయ్యలు దీక్ష శిబిరం వద్ద నృత్యాలు చేసి నిరసన తెలిపారు. సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబుకు దేవతల ఆశీర్వాదం ఉండాలని.... చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళలు మహంకాళీ వేషధారణలో నృత్యాలు చేశారు.

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో అభిమానులు పాదయాత్ర నిర్వహించారు. పోలీసుల అడ్డగింతలను దాటుకుని తిమ్మరాజుపాలెం శ్రీ కోట సత్తమ్మ ఆలయం వరకు 12కిలోమీటర్ల మేర యాత్రను కొనసాగించారు. కోనసీమ జిల్లా రాజోలులో మోకాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు. అక్రమ కేసులు బనాయిస్తూ సీఎం జగన్‌ సైకోలా వ్యవహరిస్తున్నారని నేతలు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో T.N.S.F ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు నల్ల బెలూన్లతో నిరసన తెలిపాయి. 'మేము సైతం బాబు కోసం' అంటూ విద్యార్థులు అక్షర ప్రదర్శన చేశారు.

Tags:    

Similar News