చిత్తూరు జిల్లా పద్మావతి యూనివర్సిటీలో చంద్రగిరి అసెంబ్లీ టిడిపి అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం సంచలనం రేపుతోంది. తిరుపతిలో ఇంకా ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. పులివర్తి నానిపై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్టు చేస్తామని చెప్పిన ఎస్పీ ఇప్పుడు వారిని అరెస్టు చేయకుండా చేతులెత్తేసారని పులివర్తి నాని భార్య సుధా రెడ్డి ఆరోపించారు. వారిని అరెస్టు చేసేవరకు ఊరుకునేది లేదన్నారు.
నానిపై దాడి చేసిన వారిపై సాక్షాధారాలు ఇచ్చిన పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారో చెప్పాలని సుధా రెడ్డి ప్రశ్నించారు. ప్రివెంటివ్ అరెస్టు పేరుతో తమవారిని అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసి, తమ వారిని విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. నానిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయమంటే జూన్ నాలుగో తారీఖు వరకు ఓపిక పట్టమని తమకే సలహా ఇస్తున్నారని, నాలుగో తేదీ వరకు తాము ఏమీ చేయలేమని గులాంగిరి చేస్తామని ఎస్పీ చెబుతున్నారు అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ వాళ్లను అరెస్టు చేయకపోతే రేపు చంద్రగిరి మొత్తం రోడ్ల మీదే ఉంటుందని హెచ్చరించారు. తమ ప్రాణాలు ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసని, పోలీసులకే చంద్రగిరిలో రక్షణ లేదని ఆమె ఎద్దేవా చేశారు. పులివర్తి నాని పై దాడి జరిగింది అని పోలీసులకు ఫోన్ చేసినా పట్టించుకున్న నాథుడు లేడని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన ప్రాణాలు తీస్తారా అంటూ ప్రశ్నించారు.