ఎవరి నుంచి కమీషన్ కోసం పెట్రోల్ వాహనాలు కొన్నారు? : పట్టాభి
ఏపీలో రేషన్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు.;
రేషన్ సరకుల్ని ఇంటింటికి పంపిణీ చేసేందుకు జగన్ సర్కారు కొత్త పథకం ప్రవేశపెట్టింది. ప్రజలకు మేలు కలిగించేందుకు వీలుగానే ఈ కార్యక్రమం చేపట్టినట్టు గొప్పగా ప్రకటించుకుంది. కానీ.. ఈ పథకంలో డొల్ల తనాన్ని టీడీపీ బయటపెట్టి.. విమర్శలు గుప్పిస్తోంది.
ఏపీలో రేషన్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. రేషన్ సరుకు రవాణా కోసం తీసుకొచ్చిన కొత్త వాహనాలు నిరుపయోగమని అన్నారు.
సరుకు రవాణా కోసం డీజిల్ వాహనాలు కొనుగోలు చేస్తారు గానీ.. 9వేల పెట్రోల్ వాహనాలు అవసరమా అని ప్రశ్నించారు. ఎవరి నుంచి కమిషన్ కోసం పెట్రోల్ వాహనాలు కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అటు.. ఏపీలో ఇంటింటికీ రేషన్ పథకం కోసం వాహనాల కొనుగోలు పేరుతో వందల కోట్ల దోపిడీ జరిగిందని.. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. తుగ్లక్ ముఖ్యమంత్రి మరో కొత్త పథకం తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. జగన్ ఏ కొత్త పథకం తీసుకొచ్చినా అందులో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఇంటింటికీ వ్యాన్లు కావాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు. నిత్యావసర సరుకులైన పంచదార, కందిపప్పు ధరలు పెంచి.. పేద ప్రజలపై సుమారు 800 కోట్ల అదనపు భారం మండిపడ్డారు.
అటు.. భారీ ఖరీదుతో వాహనాలు కొనుగోలు చేయడం, డీజిల్ వాహానలు కాకుండా.. పెట్రోల్ వాహనాలు కొనుగోలు చేయడం పట్ల టీడీపీ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు, అనుయాయులకు లబ్ధి చేకూర్చడం, కమీషన్లు తీసుకోవడమే ఇందులో అసలు మతలబు అని విమర్శిస్తున్నారు.