AP: జనసైనికుడి పూరిల్లు కూల్చేసిన వైసీపీ
ప్రచారంలో పాల్గొన్నాడని అక్కస్సు.... కక్ష సాధింపులకు దిగిన జగన్ పార్టీ;
నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో పాల్గొన్నందుకు ఓ జనసైనికుడి పూరిల్లుని కూల్చేశారు. కోవూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ఈ నెల 27న విడవలూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో స్థానిక జనసేన కార్యకర్త కృష్ణ, అనిత దంపతులు పాల్గొన్నారు. దీంతో కక్షసాధింపు చర్యలకు దిగిన వైసీపీ నాయకులు, గతంలో ఇంటి నిర్మాణానికి తాము ఇచ్చిన నాలుగు స్తంభాలూ ఇచ్చేయేమంటూ గద్దించారు. ఆపై ఇంటిని కూల్చేసి.... నాలుగు స్థంభాలనూ పట్టుకువెళ్లారు. విషయం తెలుసుకున్న జనసేన నేతలు బాధితులను పరామర్శించి వైసీపీ తీరుపై ఆగ్రహం చేశారు. బాధితుడికి అన్నివిధాలా అండగా ఉంటామని ప్రకటించారు.
మరోవైపు పిఠాపురం ఎన్నికల పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పిఠాపురం ఇంఛార్జ్ వర్మతో పవసమావేశమయ్యారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో దొంతమూరు చేరుకున్న పవన్ కల్యాణ్‌కు నియోజకవర్గ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కల్యాణ్... తెలుగుదేశం నేత వర్మ ఇంటికి భోజనానికి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్‌కు తెలుగుదేశం ముఖ్య కార్యకర్తలను వర్మ పరిచయం చేశారు. దొంతమూరులో అరగంట పాటు వర్మ, పవన్ మధ్య చర్చలు జరిగాయి. పవన్ కల్యాణ్‌ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.
మరోవైపు మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిని జనసేన ప్రకటించింది. వల్లభనేని బాలశౌరి పేరును అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అధికారికంగా వెల్లడించినట్లు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే జరుగుతోందని త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని పార్టీ పేర్కొంది.