YCP: వైసీపీ యూటర్న్..అమరావతికి జై
అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పాలన.. వైసీపీ ఏపీ కో ఆర్డినేటర్ సజ్జల కీలక ప్రకటన... ఎన్నికల ప్రచారం నాటి ప్రకటనపై యూటర్న్... గత ఎన్నికల దెబ్బకు రూటు మార్చిన వైసీపీ
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసి విఫలమైన జగన్.. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రూటుమార్చారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలపై విమర్శలు కూడా చేశారు. అయితే ఇప్పుడు రాజధానుల విషయంలో వైసీపీ పూర్తిగా యూటర్న్ తీసుకుంది. ఈ మేరకు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ సంచలన ప్రకటన చేశారు. ఓ డిజిటల్ మీడియా కాంక్లేవ్ లో పాల్గొన్న వైసీపీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి మూడు రాజధానులు ఆలోచన లేదని ఆయన తేల్చిచెప్పేశారు. జగన్ అమరావతి నుండే పరిపాలన సాగిస్తారని సజ్జల తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుల ప్లాట్స్ అభివృద్ధి చేసి ఇస్తామని ప్రకటించారు. ఖర్చు తగ్గించి బ్రభుత్వంపై భారం తగ్గిస్తూ గుంటూరు-విజయవాడ మధ్య మహా నగర నిర్మాణానికి కృషి చేస్తామని సజ్జల ప్రకటించారు.
"వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే, అమరావతి రాజధానిగా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోనే నివసిస్తారు, విశాఖపట్నంకు వెళ్లరు" అని వ్యాఖ్యానించారు. గతంలో విశాఖపట్నంకు మారాలని ఆలోచించామని, కానీ అది సాధ్యం కాలేదనన్నారు. మూడు రాజధానులను ప్రజలు వద్దన్నారని అందుకే తాము పునరాలోచిస్తున్నామన్నారు. "లక్షల కోట్ల అప్పులు చేసి అమరావతి కట్టడానికి మేము వ్యతిరేకమే. బెజవాడ-గుంటూరు మధ్య రాజధాని నిర్మిస్తే రెండు నగరాలు బాగా అభివృద్ధి చెందేవి" అని సజ్జల వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం అమరావతి అభివృద్ధి పేరుతో చంద్రబాబు నాయుడు తన అనుచరులకు మాత్రమే ప్రయోజనం చేయాలని కుట్ర పన్నారు. మేము మళ్లీ రాజకీయంలోకి వస్తే, అమరావతి ప్రాజెక్ట్ను పరిశీలిస్తాము, కానీ రాజధాని భావనను మార్చకుండా ప్రజల అభివృద్ధికి ఉపయోగపడేలా చేస్తామని చెప్పారు. దీంతో అమరావతి రైతులకు వైసీపీ తీపి కబురు అందించింది.
రాజకీయాల్లో హాట్ టాపిక్
అమరావతి నుంచే వైసీపీ ప్రభుత్వ పాలన అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటిదాక వైసీపీ పార్టీ, ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ మూడు రాజధానుల విధానాన్ని నెత్తికెత్తుకున్న సంగతి తెలిసిందే. పరిపాలనను, అభివృద్ధిని వికేంద్రీకరించడం ద్వారా అన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లోని ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది వైసీపీ విధానం అంటూ.. విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా వైసీపీ ప్రభుత్వం చట్టం చేయడం..దీనిని వ్యతిరేకిస్తూ టీడీపీ వర్గీయులు కోర్టుకెళ్లారు. వైసీపీ 2019 ఎన్నికలకు ముందు రాజధానిని మార్చబోమని ప్రజలకు హామీ ఇచ్చింది. 2024అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి సారధిగా చంద్రబాబు తన ప్రచారంలో అమరావతి రాజధాని సమస్యను ప్రచారాస్త్రంగా మలిచారు. 2014లోనే అమరావతిని ఎంపిక చేశామని, 2019 వరకు నిర్మాణాలు ప్రారంభించగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వీర్యం చేసిందన్నారు. మార్చిలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మూడు రాజధానుల విధానానికి కాలం చెల్లిందని.. మళ్లీ పార్టీలో చర్చిస్తామని ప్రకటన చేశారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మూడు రాజధానుల ఆలోచన లేదని..ఇక నుంచి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అమరావతి నుండే పరిపాలన సాగిస్తారు అని చేసిన ప్రకటనతో ఏపీలో రాజధాని అంశంలో గందరగోళానికి తెరపడినట్లేనని భావిస్తున్నారు.