PAWAN: రాబోయేది జనసేన-టీడీపీ ప్రభుత్వమే

కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు వైసీపీ వాళ్లే.... జగన్‌ పార్టీ 15 సీట్లు వస్తే గొప్పే

Update: 2023-10-02 03:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయేది జనసేన-టీడీపీ ప్రభుత్వమేనని.... జనసేనాని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని సీఎం జగన్‌ అంటున్నాడని.. ఈ యుద్ధంలో కౌరవులు వైసీపీ వాళ్లేనని పవన్‌ వెల్లడించారు. వచ్చే ఎన్నికలను జగన్‌ కురుక్షేత్ర యుద్ధంతో పోలుస్తున్నారని, తాము ఏ యుద్ధానికైనా సిద్ధమని ప్రకటించారు. వంద మందికి పైగా ఉన్నారు కాబట్టి.... వాళ్లే కౌరవులవుతారని విమర్శించారు. ఈ సమరంలో జగన్‌ ఓటమి ఖాయమని, జనసేన-టీడీపీ కూటమి గెలుపు డబుల్‌ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాలుగో విడత వారాహి యాత్రను పవన్ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో పవన్‌ జగన్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయని సీఎం జగన్‌ ప్రగల్భాలు పలుకుతున్నాడని, ఆయనకు 15 సీట్లు వస్తే గొప్ప విషయమని అన్నారు.


ఆంధ్రప్రదేశ్‌ను పట్టి పీడిస్తున్న వైసీపీ మహమ్మారికి జనసేన- టీడీపీ సంకీర్ణమే వ్యాక్సిన్ అని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల ఉమ్మడి ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. వైసీపీకి ఒక్క అవకాశమిస్తే రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకువెళ్లారో ప్రజలంతా చూశారన్నారు. జగన్‌ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని తిరిగి కోలుకునేలా చేసేందుకు కనీసం పదేళ్లు పడుతుందని తెలిపారు. జగన్‌ పాలన బాగుంటే వారాహి యాత్రకు ఎందుకు ఇంత స్పందన ఎందుకు వస్తుందని, తాను ఇలా రోడ్డుపైకి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజయోజనాలు కోసమే తెలుగుదేశంతో కలసి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. 2024లో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని... జగన్‌ను పారిపోయేలా చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.


తన వద్ద డబ్బులు ఉండకూడదనే జగన్‌ తన సినిమాలకు ఆటంకాలు సృష్టించారన్న పవన్‌, నిరుద్యోగుల దగ్గర డబ్బులు ఉండకూడదనే ఉద్యోగాలను దూరం చేశారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా అన్ని వర్గాలవారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో భాజపా, తెలుగుదేశాన్ని... కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే వ్యతిరేకించినట్లు పవన్‌ తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతోనూ... ప్రత్యేక ప్యాకేజీ ఆమోదంలో తెదేపాతో విభేధించినట్లు చెప్పారు.

2014లో తన వల్లే సీఎం పదవి చేజారిపోయిందని జగన్‌కు అంత కోపం ఉంటే.. నాలుగేళ్లు ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు ఇంకెంత కోపం ఉండాలని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ తీసుకొస్తానని ప్రకటించి.. ఆ తర్వాత మోసం చేశాడన్నారు. వైసీపీ పతనం మొదలైందని, రాబోయే ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి పంపడమే జనసేన-టీడీపీ లక్ష్యమని ప్రకటించారు. 

Tags:    

Similar News