Income Tax Act 2025 : ఇక టాక్స్ టెన్షన్ ఇక లేదు.. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం.
Income Tax Act 2025 : భారతదేశంలో ఆదాయపు పన్ను కట్టడం అంటే ఒక పెద్ద ప్రహసనం. చట్టంలోని సెక్షన్లు, నిబంధనలు సామాన్యుడికి అస్సలు అర్థం కావు. ఈ సంక్లిష్టతను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. 1961 నాటి పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో, సరికొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ను తీసుకువస్తోంది. ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. సుమారు 64 ఏళ్ల క్రితం నాటి పాత కాలపు రూల్స్‌కు ప్రభుత్వం మంగళం పాడబోతోంది.
1961లో రూపొందించిన చట్టం నేటి డిజిటల్ కాలానికి ఏమాత్రం సరిపోవడం లేదు. ఆ కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ చాలా భిన్నంగా ఉండేది. గడిచిన దశాబ్దాలలో వందలాది సవరణలు చేయడం వల్ల ఆ చట్టం ఒక పెద్ద చిక్కుముడిలా తయారైంది. సామాన్య ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు పన్ను చెల్లించాలన్నా, ఐటీఆర్ ఫైల్ చేయాలన్నా టాక్స్ ఎక్స్‌పర్ట్స్ మీద ఆధారపడాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులన్నింటినీ గమనించిన ప్రభుత్వం, చట్టాన్ని మొదటి నుండి సులభంగా తిరిగి రాయాలని నిర్ణయించింది.
కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 పాత దానికంటే సుమారు 50 శాతం చిన్నగా ఉండబోతోంది. అనవసరమైన సెక్షన్లను తొలగించి, భాషను చాలా సరళం చేశారు. దీనివల్ల సామాన్య పౌరులు కూడా చట్టాన్ని చదివి అర్థం చేసుకోగలరు. పన్ను చెల్లింపుదారులకు, అధికారులకు మధ్య వివాదాలు తగ్గించి, కోర్టు కేసుల భారం తగ్గించడమే ఈ కొత్త చట్టం ప్రధాన ఉద్దేశ్యం. పారదర్శకతను పెంచడం ద్వారా పన్ను వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
పన్ను చెల్లింపుదారులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. ఈ కొత్త చట్టం వల్ల మీ టాక్స్ స్లాబుల్లో కానీ, పన్ను రేట్లలో కానీ ఎటువంటి మార్పు ఉండదు. అంటే మీరు కట్టే పన్ను పెరగదు, తగ్గదు. కేవలం నిబంధనలు మాత్రమే సులభతరం అవుతాయి. ఇది రెవెన్యూ న్యూట్రల్ చట్టం, అంటే దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మార్పు ఉండదు. కానీ, పన్ను కట్టే ప్రక్రియ మాత్రం చాలా హాయిగా సాగిపోతుంది.
ఇప్పటివరకు మనం ఆదాయపు పన్నులో ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనే పదాలతో కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం. కొత్త చట్టంలో ఈ గందరగోళానికి తెరదించుతూ.. కేవలం టాక్స్ ఇయర్ అనే ఒకే ఒక పదాన్ని ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల ఐటీఆర్ ఫైల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అలాగే, గడువు ముగిసిన తర్వాత రిటర్న్స్ ఫైల్ చేసినా, టీడీఎస్ రీఫండ్ పొందే హక్కును పన్ను చెల్లింపుదారులకు కల్పించారు. రాబోయే 2026-27 బడ్జెట్‌లో ప్రకటించే అన్ని మార్పులు కూడా ఈ కొత్త చట్టం పరిధిలోకి వస్తాయి.