Renault Duster : డస్టర్ ఈజ్ బ్యాక్..అదిరిపోయే ఫీచర్లు, 4x4 పవర్‌తో రీ-ఎంట్రీ
Renault Duster : భారతీయ ఎస్‌యూవీ మార్కెట్‌లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి, కుర్రాళ్ల కలల కారుగా నిలిచిన రెనాల్ట్ డస్టర్ మళ్ళీ వస్తోంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత, సరికొత్త హంగులతో, నెక్స్ట్ జనరేషన్ మోడల్‌గా ఇండియన్ రోడ్లపైకి రావడానికి సిద్ధమైంది. జనవరి 26, 2026న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కారును అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించి తాజాగా విడుదలైన టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొత్త డస్టర్‌ను రెనాల్ట్ కంపెనీ సాదాసీదాగా తీసుకురావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా మూడు ఖండాల్లో, మైనస్ 23 డిగ్రీల గడ్డకట్టే చలి నుంచి 55 డిగ్రీల మండే ఎండల వరకు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో దీనిని పరీక్షించారు. ఏకంగా 10 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం టెస్టింగ్ పూర్తి చేసుకున్న ఈ కారు, ఆఫ్-రోడింగ్‌లోనూ, సిటీ రోడ్లపైనూ తిరుగులేని పెర్ఫార్మెన్స్ ఇస్తుందని కంపెనీ గర్వంగా చెబుతోంది. CMF-B ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారమ్ మీద రూపుదిద్దుకున్న ఈ కారు, పాత మోడల్ కంటే ఎంతో పటిష్టంగా ఉండబోతోంది.
కొత్త 2026 రెనాల్ట్ డస్టర్ డిజైన్ పరంగా కంప్లీట్ మేకోవర్ అయ్యింది. ముందు భాగంలో రెనో కొత్త లోగోతో పాటు సరికొత్త గ్రిల్ Y ఆకారంలో ఉండే ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్ కారుకు ఒక అగ్రెసివ్ లుక్‌ను ఇచ్చాయి. వెనుక వైపు కూడా Y షేప్ ఎల్‌ఈడీ టైల్ ల్యాంప్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, 18-ఇంచ్ భారీ అలాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, కారు చుట్టూ ఉన్న బాడీ క్లాడింగ్ దీనిని ఒక పవర్‌ఫుల్ ఎస్‌యూవీగా చూపిస్తున్నాయి.
పాత డస్టర్‌లో ఇంటీరియర్ కొంచెం సింపుల్‌గా ఉండేది, కానీ కొత్త మోడల్‌లో రెనో లగ్జరీకి పెద్దపీట వేసింది. డాష్‌బోర్డ్‌పై 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సదుపాయం ఉన్నాయి. డ్రైవర్ కోసం 7-ఇంచ్ డిజిటల్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, అర్కామిస్ 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా, ఇందులో లెవల్ 2 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి హై-ఎండ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండబోతున్నాయి.
కొత్త డస్టర్ రెండు రకాల పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉంది. ఒకటి 1.3 లీటర్ టర్బో పెట్రోల్ కాగా, రెండోది 1.2 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో పాటు, ఆఫ్-రోడ్ ప్రియుల కోసం టాప్ ఎండ్ వేరియంట్లలో 4X4 డ్రైవ్ ట్రెయిన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక మైలేజ్ కావాలనుకునే వారి కోసం స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా లాంచ్ చేసిన కొద్ది నెలలకే తీసుకురావాలని రెనో ప్లాన్ చేస్తోంది.