Tata Motors : టాటా కార్లపై కనకవర్షం..పంచ్, నెక్సాన్, సఫారీ కొంటే భారీ తగ్గింపు.
Tata Motors : కొత్త ఏడాదిలో కారు కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 2026 నెలకు గానూ తన పాపులర్ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. టాటా పంచ్ నుంచి లగ్జరీ సఫారీ వరకు దాదాపు అన్ని మోడళ్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లను ఆకర్షించడానికి కన్జ్యూమర్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు, ఎస్‌బీఐ యోనో స్పెషల్ బెనిఫిట్స్ వంటి అస్త్రాలను టాటా ప్రయోగించింది. ఈ ఆఫర్లు జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
టియాగో, టిగోర్‌లపై అదిరిపోయే ఆఫర్
టాటా ఎంట్రీ లెవల్ కార్లయిన టియాగో, టిగోర్ లపై రూ.35,000 వరకు తగ్గింపు లభిస్తోంది. కేవలం బేస్ వేరియంట్ మినహా మిగిలిన అన్ని వేరియంట్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. మీరు పాత మోడల్ స్టాక్ లేదా కొత్త 2025 మోడల్ తీసుకున్నా ఈ బెనిఫిట్స్ పొందవచ్చు. 2025 మోడళ్లలో ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌ను టాటా మరింత కలర్‌ఫుల్‌గా అప్‌డేట్ చేసింది.
ఆల్ట్రోజ్‌పై భారీగా రూ.85,000 సేవింగ్స్!
ప్రీ-ఫేస్‌లిఫ్ట్ ఆల్ట్రోజ్ కొనాలనుకునే వారికి ఇది పండగే అని చెప్పాలి. పెట్రోల్, డీజిల్, సిఎన్జీ వేరియంట్లపై ఏకంగా రూ. 60,000 కన్జ్యూమర్ డిస్కౌంట్ ఇస్తోంది. దీనికి తోడు పాత కారును ఎక్స్ఛేంజ్ చేస్తే మరో రూ.25,000 బోనస్ వస్తుంది. అంటే మొత్తం కలిపి రూ.85,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇక కొత్త ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లపై గరిష్టంగా రూ.25,000 వరకు తగ్గింపు ఉంది. ఎస్‌బీఐ యోనో ద్వారా బుక్ చేసుకుంటే అదనపు లాభాలు కూడా ఉంటాయి.
పంచ్, నెక్సాన్, కర్వ్.. ఎస్‌యూవీల సందడి
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న ఎస్‌యూవీ టాటా పంచ్ పై రూ.40,000 వరకు తగ్గింపు ఉంది. ఇందులో రూ.20,000 లాయల్టీ బోనస్ కూడా కలిపి ఉంది. ఇక సబ్-4 మీటర్ ఎస్‌యూవీ నెక్సాన్ పై రూ.50,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. టాటా నుంచి వచ్చిన లేటెస్ట్ కారు కర్వ్ పై మాత్రం లాయల్టీ బోనస్ లేదు, కానీ ఇతర ఆఫర్ల ద్వారా రూ.40,000 వరకు తగ్గించుకోవచ్చు.
హారియర్, సఫారీ.. లగ్జరీ ఎస్‌యూవీలపై పండగ
టాటా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలైన హారియర్, సఫారీలను రీసెంట్‌గా కొత్త 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో టాటా అప్‌డేట్ చేసింది. ప్రస్తుతం డీజిల్ వేరియంట్లపై ఏకంగా రూ.75,000 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇందులో రూ.25,000 నేరుగా తగ్గింపు కాగా, రూ.50,000 ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ రూపంలో లభిస్తుంది. కార్పొరేట్ ఉద్యోగులకు, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సభ్యులకు, ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి సంస్థల ఉద్యోగులకు ప్రత్యేక అలయన్స్ ఆఫర్లు కూడా ఉన్నాయి.