రామోజీరావు మృతిపట్ల దర్శకధీరుడు రాజమౌళి సంతాపం వ్యక్తం చేశారు. తన కృషితో 50 ఏళ్లుగా ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన ఆయనను ‘భారతరత్న’తో సత్కరించాలని అన్నారు. అదే ఆయనకు మనమిచ్చే ఘననివాళి అని పేర్కొన్నారు. రామోజీరావు భారతీయ మీడియాలో విప్లవాత్మక కృషి చేశారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని నటుడు దగ్గుబాటి వెంకటేశ్ ట్వీట్ చేశారు.
రామోజీరావు మృతి పట్ల తెలంగాణ బీజేపీ చీఫ్ జి.కిషన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘చిత్తశుద్ధి, అంకితభావంతో కష్టించి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనడానికి రామోజీరావు జీవితం ఒక చక్కటి ఉదాహరణ. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయన చెరగని ముద్రవేశారు. జర్నలిజానికి ఓ గొప్ప గుర్తింపును కల్పించారు. ఆయన రాసిన ప్రతి అక్షరం, వేసిన ప్రతి అడుగూ తెలుగుదనమే’ అని పేర్కొన్నారు. రామోజీరావు అంత్యక్రియలు రేపు జరగనున్నాయి.
రామోజీరావుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నివాళులర్పించారు. ‘భారత మీడియా, వినోద రంగం రామోజీలాంటి దిగ్గజాన్ని కోల్పోయింది. వ్యాపారవేత్త, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ న్యూస్ నెట్‌వర్క్, రామోజీ ఫిల్మ్ సిటీతో సహా అనేక సంస్థలకు ఆయన మార్గదర్శకుడు. పద్మవిభూషణుడు. ఆయన చేసిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయి. ఆయన కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని Xలో పోస్ట్ చేశారు.